పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఆ.వె. వచ్చె మింట నుండి వాసవీనందను, కడకు మాటలాడఁ గడఁక తోడ

భద్ర విమలకీర్తిపారగుఁ డారూఢ, నయ విశారదుండు నారదుండు. (1-84)


కం. కనియె న్నారదుఁ డంతన్, వినయైక విలాసు నిగమ విభజన విద్యా

జనితోల్లాసున్ భవదు:ఖ నిరాసు గురుమనోవికాసున్ వ్యాసున్. (1-85)


వ. ఇట్లు నిజాశ్రమంబునకు వచ్చిన నారదు నెఱింగి లేచి వ్యాసుండు విధివత్‌క్రమంబునం బూజించిన నతండు లేనగవు నెగడెడి మొగంబు తోడ విపంచికాతంత్రి వ్రేల మీటుచు నిట్లనియె. (1-86)

అధ్యాయము-5

ఉ. ధాతవు భారత శ్రుతి విధాతవు వేద పరార్థ జాత వి

జ్ఞాతవు కామముఖ్య రిపుషట్క విజేతవు బ్రహ్మతత్త్వ ని

ర్ణేతవు యోగినేతవు వినేతవు నీవు చలించి చెల్లరే !

కాతరు కైవడిన్ వగవఁ గారణమేమి పరాశరాత్మజా ! (1-87)


వ. అనినఁ బారాశర్యుం డిట్లనియె. (1-88)


కం. పుట్టితి వజు తనువునఁ జే, పట్టితివి పురాణపురుషు భజనము పదముల్

మెట్టితివి దిక్కులం దుది, ముట్టితివి మహాప్రబోధమున మునినాథా !


వ. అదియునుం గాక నీవు సూర్యుని భంగి మూఁడు లోకములం జరింతువు. వాయువు పగిది నఖిల జనులలోన మెలంగుదువు.సర్వజ్ఞుండ వగుటం జేసి,


కం. నీ కెఱుఁగరాని ధర్మము, లోకములను లేదు బహువిలోకివి నీవున్

నా కొఱఁత యెట్టిదంతయు, నాకున్ వివరింపుమయ్య నారద ! కరుణన్. (1-91)


వ. అనిన నారదుం డిట్లనియె. (1-92)


ఉ. అంచితమైన ధర్మచయమంతయుఁ జెప్పితి వందులోన నిం

చించుక గాని విష్ణుకథ లేర్పడఁ జెప్పవు ధర్మముల్ ప్రపం

చించిన మెచ్చునే గుణ విశేషము లెన్నినఁ గాక నీకు నీ

కొంచెము వచ్చుటెల్ల హరిఁ గోరి నుతింపమి నార్యపూజితా ! (1-93)


మ. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ

సురుచి భ్రాజితమైన మానస సరస్ స్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీ

హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీ

కరమై యుండ దయోగ్య దుర్మద నదత్ కాకోల గర్తాకృతిన్. (1-94)