Jump to content

పుట:Shriiranga-mahattvamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

105


జ్ఞాను లగుమునులు వినఁ దన
సూనులకుం గరుణఁ దమ్మిచూ లిట్లనియెన్.

44


సీ.

ఏదేవుఁ డాదరం బెసఁగ ని న్నధ్యాత్మ
విద్యావిశేషసంవేదిఁ జేసె,
నేదయానిధి కటాక్షేక్షణామృతమున
గంటి వీవిపు డధికప్రియంబు
లెవ్వని విభవాంశ మించుకేనియుఁ గనఁ
జాల రత్యంతవిజ్ఞానులైన
నేశుభాకారుఁ డహీంద్రపర్యంకంబు
నందొప్పు శ్రీరంగమందిరమున


తే.

నట్టి నారాయణప్రభు వమ్మహాత్ముఁ,
డతని దివ్యాయుధములు శిష్యవ్రజంబు
భూత దుర్లక్ష్యుఁడైన యప్పుణ్యమూర్తి,
గాననయ్యె భవద్భాగ్యగరిమఁ జేసి.

45


ఉ.

క్రమ్మఱ నాజగద్గురునిఁ గన్గొనఁ గల్గెడు నీకు రంగగే
హమ్మున నంత దాఁక నియతాత్ముఁడవై పరమాత్మ చింతఁ గా
ర్యమ్మున నుండు మెల్లపుడు నాశశిపుష్కరిణీతటంబునం
దిమ్మహి దీనిపెంపు వచియింపఁగ శక్యమె యెట్టి వానికిన్.

46


క.

పరమంబై సకలజగ
త్పరిపావనమై సమస్తభద్రాకరమై
దురితనిరాసక మగు పు
ష్కరిణీతీర్థంబు తీర్థసారం బెందున్.

47


తే.

అమలమతులై జితేంద్రియు లైనవార
లీజలస్నానపానాదు లెలమిఁ జేసి,
యందు విహరించుచుండుదు రెల్లనాడు
మహితపరమాత్మభక్తిసమగ్రు లగుచు.

48