పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

దీసికొనవలెను. అయితే గోవర్థనోద్ధారణకథను నమ్మినను నమ్మవచ్చును. ఏల యనిన దిక్పాలకులలో నొకఁడగు నింద్రుఁడు తనకు బ్రజలు చేయుపూజ నాటంకపరచిన మనుజ రూపముతో నున్న యీస్వామివారి నిజస్థితిని సాధారణముగ దెలియక కోపించి శిలావృష్టిని గురిపించియుండిన నుండ వచ్చును. అప్పు డాసర్వశక్తి గోవర్ధనగిరి యెత్తి గోవులను గోపకులను రక్షించుట యాశ్చర్యమా?

ఇట్లు శ్రీరామకృష్ణులు బృందావనమున విహరింపుచు బాలురయ్యును దుష్టులను సంహరించుచుండుటను విని కంసుఁ డక్రూరుని బృందావనమునకుఁ బంపెను. అతనిపనుపున రామకృష్ణులు మధురానగరమునకుఁ బోవుచుండునపుడు శ్రీకృష్ణమూర్తి యక్రూరునకు నిజరూపమును జూపించెను. ఆ పిదప నన్నదమ్ములిద్దరును మధురానగరమున బ్రవేశించి కంసుని సభకు బోవుటకు ముందు కంసుని చాకలివానినిఁ జంపి వస్త్రంబులు గొనిరఁట. మరియు విల్లువిరిచి యాయుధశాల కావలి వారిని జంపిరఁట. ఏమివింత ? పీతాంబరధారి దుష్టుఁడగు కంసుఁడు కట్టెడివస్త్రములను గట్ట గోరునా ? అందుకుగాను, పాపము చాకలవానినిఁ జంవునా ! ఇపుడు స్వామివారు కంస సభలో నుచితాసనమునఁ గూర్చుండుటకు బోవుట లేదు. మల్ల యుద్ధము చేయువానికి విలువగలవస్త్రములతో బని యేమి ?