పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

కులతో ఘోరయుద్ధము చేయుచుండఁగా గౌరవులచే బన్నఁ బడిన పద్మవ్యూహముఁ జొచ్చుటకు ధర్మరాజాదివీరుల కశక్య మయ్యెను. అప్పుడు ధర్మరాజుచే బ్రేరితుఁడై పడుచుఁదనమున నొంటరిగా నావ్యూహమునుఁ జొచ్చి మధ్యభాగమున కరిగెను. అంతట నితఁ డర్జునునివంటివీరుఁడైనందుననే ద్రోణాదు లనేకులు చుట్టువారుకొని యధర్మయుద్ధమున విరధునిఁ జేసి ఖడ్గము తప్ప తదితరాయుధముల నొక్కొక్కరు కొట్టి పారవైచిరి. అప్పు డితఁడు ఖడ్గహస్తుఁడై దుశ్శాసనుని కుమారుఁడగు లక్ష్మణునితో శరీరమున బ్రాణములుండువరకు ద్వంద్వయుద్ధమునుఁ జేసెను. ఆపిదప నుభయవీరులు నేక కాలమున సమసిరి.

11. సాత్యకి.

ఇతఁడు సత్యకుఁడను యాదవునికుమారుఁడు. శ్రీకృష్ణుల వారికి జ్ఞాతివరుసను దమ్ముఁడు. అర్జునునియొద్ద ధనుర్విద్య నేర్చి యతనితో సముఁ డనిపించుకొనెను. యుద్ధమునందు బాండవుల పక్షమున నుండెను. శ్రీకృష్ణులవారు రాయభారమున కేగినపుడు దుర్యోధనాదులు వారిని బంధింప బ్రయత్నింపఁగా సభలో నున్నవారలకు నేను జూలుదు నని యీసాత్యకి నిలువఁబడి యుండెను. పయినుండి వచ్చువారల నడ్డవరచుటకు గృతవర్మ యుండెను. యుద్ధమునం దితఁడు భూరిశ్రవుఁడు, సోమదత్తుడు, జలసంధుఁడు మొదలగురాజులను, జంపెను.