పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

క. పలుమాఱుం దలవాకిట
   మెలఁగుట యసతీజనైకమిత్రత కలహం
   బుల కెలయుట నగుఁబలుకులఁ
   బెలుచ నగుట నాకుఁగాని పేరివి మగువా.

క. పతు లిచ్చ మెయిఁ బ్రవాస
   స్థితులైనం బుష్పగంధదీప్తాభరణ
   ప్రతతి ధరియింపఁ దద్గత
   మతి నగుచుఁ దదాగమంబ మది గాంక్షింతున్.

ఉ. అత్తకుభక్తిగల్గిమదినాయమసెప్పినమాడ్కి జేటికా
    వృత్తములాచరింతు గురువిప్రసురాతిధిపూజనంబుల
    త్యుత్తమభక్తినేనతగనోపియొనర్తుఁ బ్రియంబు దాల్మియున్
    మెత్తదనంబు సంతతముమేలుగఁదాల్తుసమస్తభంగులన్.

క. కడుమృదువు లనుచుఁ దేకువ
   సెడి యెపుడుఁ జరింప భరతసింహులు కోపం
   బడరిన నాశీవిషముల
   పడువునఁ గ్రూరులని వెఱపు వదలక కొలుతున్.

అజ్ఞాతవాసమున నీమె సైరంద్రీవేషమున గాలము గడపెను. తన్ను మోహించి పాతివ్రత్యభంగమును జేయఁ దలఁచిన విరటుని మరదియగు సింహబలునివిషయము భీమునకెఱింగించి యతనిచే నతనిఁ జంపించెను.