పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

133

చున్నందున నాయాగరక్షణార్థము తనవెంట శ్రీరాములవారినిఁ బంపుమని కోరి యందువలన విశేషమగుమేలు సమకూడునని పలికెను. అపు డామహారాజు జ్యేష్ఠుఁడును ధర్మప్రధానుఁడు నగు నాబాలునిఁ బంప వెఱచెను. అందుకు విశ్వామిత్రుఁడు కడుం గుపితుఁడు కాఁగా వశిష్ఠమహర్షి యామహారాజుతో భయము లే దనియు విశ్వామిత్రునివలనఁ దివ్యాస్త్రాదిలాభము గలుగు ననియు బోధించినపిదప నామహారాజు రామలక్ష్మణుల నుభయులను బిలిపించి విశ్వామిత్రునివెంటఁ బంపెను. ఇట్లు వారు మువ్వురు నేగుచుండఁగా శ్రీరాములవారు. తాటకయను దుష్టురాలిని సంహరించిరి. ఆయాడుదానిం జంపుటకు సంశయింపఁగా విశ్వామిత్రుఁడు దుష్టులగుస్త్రీలను సంహరించుటచేఁ బాపములేదని పూర్వము జరిగినకథలను జెప్పి చంపుమనఁగా నయోధ్యను విడుచునప్పుడు తమతండ్రివలన విశ్వామిత్రుఁడు చెప్పినదానినంతయు జేయు మని యాజ్ఞాపింపఁబడి యున్నందునను శ్రీరాములవా రాతాటకను సంహరించిరి. అట్లు కేవల భుజబలమువలనఁ దానిని సంహరించిన శ్రీస్వామివారిని మెచ్చుకొని వారికి దివ్యాస్త్రముల నామహర్షి యుపదేశించెను. వానిని శ్రీరాములవారు లక్ష్మణున కుపదేశించిరి. ఆపిదప యాగభంగము చేయుటకు వచ్చినమారీచసుబాహులతో శ్రీరాములవారు యుద్ధము చేసిరి. అందు మొదటి