పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

113

ఈదశరథమహారాజునకు జ్యేష్ఠ భార్యయగు కౌసల్యయందు శ్రీరాములవారును, ద్వితీయభార్యయగు సుమిత్రయందు లక్ష్మణ శత్రుఘ్నులును, తృతీయభార్యయగు కైకేయియందు భరతుఁడు ననునలువురుకుమారులు జన్మించిరి. ఈకుమారులు దినదినప్రవర్ధమానులయి విద్యల నభ్యసించుచు వచ్చిరి. అంతట విశ్వామిత్రుఁ డనుమహర్షి దశరథునికడకు వచ్చి శ్రీరాములవారిని తనయజ్ఞరక్షణముకొరకుఁ బంపు మని కోరెను. బాలుఁడగు తనతనయుని నట్లు పంపుటకు వెరచుచున్నయా రాజును వశిష్ఠమహర్షి భయములే దనియు, నాఋషివెంటఁ బంపినయెడల మేలు గలుగు ననియు సమాధానపరచెను. అపు డారాజు శ్రీరాములవారిని వారితో నత్యంతమైత్రిగల లక్ష్మణుని నాతనివెంటఁ బంపెను. ఈరామలక్ష్మణులు విశ్వామిత్రునిపనుపున నాతనికార్యములనుఁ దీర్చి యాముని వలనఁ దివ్యాస్త్రలాభమునుఁ బొంది వివాహితు లయి యయోధ్య కు వచ్చినపిదప వృద్ధుఁడగు నద్దశరథుఁడు జ్యేష్ఠుఁడగు శ్రీరామునకుఁ బట్టాభిషేకము జేయుటకు సిద్ధపడియుండఁ గాఁ దనభర్త తనకు బూర్వ మిచ్చెదనన్న వరములను మంధరయను దానిదుర్భోధవలన కైకేయి యడిగెను.

ఆవరములు :--- పదునాలుగుసంవత్సరములు శ్రీరాములవారి నరణ్యవాసముసకుఁ బంపుటయు, భరతునకు రాజ్యాభి