పుట:Shathaka-Kavula-Charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాలుకురికి సోమనాథుఁడు.

33

"జ్యోతిర్మయశాంభవీజ్ఞాన దీక్షాబోధ యొక్క పరమరహ'శ్యార్థమును” సంగయ్య అనేశరణునికి 160 వచనములలో సంగ్రహము చేసి ఉపదేశ మొనర్చెను. ఇవేకాక యీతఁడు శీలసంపాదనము, సోమేశ్వరశతకము, సహస్రగణనామము, అను గ్రంథములుకూడ వ్రాసియుండెను. పైనఁజెప్పినగ్రంథములలో ఆరాధ్యచరిత్రము, బసవపురాణమును తెలుఁగు, అన్యవాదకోలాహలము బసవన్న పంచగద్య, సోమనాథభాష్యము, యివిసంస్కృతము, పంచగద్యలలో నచ్చటచ్చట కన్నడ కందపద్యము లున్నవి. . తక్కినరగడలు, వచనములు, శీలసంపాదనము, సోమేశ్వరశతకము, సహస్రగణనామము కన్నడ భాషలో వ్రాసెను,

ఈతనికి తత్త్వవిద్యాకలాప, కవికాసార, అన్యవాదకోలాహళ, ప్రత్యక్షభృంగీశావతార మొదలగుబిరుదులు కలవు. ఇతఁడు బసవనికి బిమ్మట 30 సంవత్సరములలో నుండెను. కర్ణాటకభాషలో సోమనాథుఁడు వ్రాసినగ్రంథము లిప్పటికిఁ జిక్కుచున్నవి.” అనువిషయములు కర్ణాటకకవిచరిత్రలో వ్రాసియున్నారు.