పుట:Raajasthaana-Kathaavali.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షోడశ రాజకుమార చరిత్ర

181


నిచ్చెనలు తెచ్చుకొనుట మఱచినందున వారు కోటగోడ లెక్క జాలరైరి. అందుచే సూక్తవతులు సింహ ద్వారము భేదించి కోటలోఁ బ్రవేశింపవలసియుండెను. ఈ పనికయి అనేకాయుధములు పుచ్చుకొని వారు తలుపుగోడలఁ గొంతవఱకు శిధిల పఱచిరి. తలుపులు కొంత వఱకు వదులయిన వని గ్రహించి యచలుఁడు తన మదపుటేనుఁగుచేఁ ద్రోయించి తలుపులు విడఁ గొట్టవలయు నని తలంచి యేనుఁగుఁ బురి కొల్పుమని మావటివాని కాజ్ఞాపించెను. ఇంతలో నక్కడ కోటకావలివాండ్రు వచ్చి కోటగోడలపయి నిలిచి సూక్తవతులతో ఘోర యుద్ధ మారంభించిరి, మావటీడు యజమానుని యాజ్ఞఁ బూని కవాటభేదనము సేయుమని యేనుఁగుం బురికొల్పి ముందుకుఁ ద్రోసెనుగాని యది తలుపులవఱకుఁ జని యటనుండి కదలదయ్యె. మావటీని బెదరింపులు బతిమాలుటలు వాడిగలయంకుశ పుపోటులు వ్యర్థములై మదగజము నొక్క గజమయిన కదపఁజూలదయ్యె. తలుపులకు ఇనుప బొంగరములట్లు మొనలు దేరిన వాడిబొగడలు వందలకొలఁది యుండెను. ఆబోగడలు గ్రుచ్చుకొనినచో దట్టమయిన తన కుంభస్థలము గూడఁ బగిలి నెత్తురు వరదలుపాఱు ననుభయమున తలపులంద్రోయక మదపుటేనుఁగు మొద్దువలె నిలిచెను. అటులుండ నంతలో దుగ౯ము యొక్క రెండవపక్క నొక కలకలము వినఁబడెను, చందావతులు వచ్చి నిచ్చెనలు వేసికొని కోటగోడల కెగఁబ్రాకి తమవంశ బిరుదు లం జదువుకొనుచు సింహనాదములఁ జేయనారంభించి, ఆకలకలము సహింపక కార్యము దప్పిపోవు చున్నదని భయపడి యచలుఁడు మద గజము నుండి గుభాలున నేల కురికి విసవిసఁబోయి తనయేనుఁగునకుఁ దలుపులకు నడుమ నిలిచి మావటీని బిలిచి "యోరీ' యీసారి తలుపులు పగులఁద్రోయుట కేనుఁగు బురికోల్పుము. ఏనుఁగు కుంభ స్థలమునకు నా మెత్తని శరీరము తగులునుగాని 'మేకులు గుచ్చుకొనవు. నీవు సందేహించితివా చచ్చితివని నమ్ము” మని యాజ్ఞాపించెను.