పుట:Punitha Matha.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలవరకు పితృపాదుల రచనల్లో నుండే స్వీకరించాం. మరియను గూర్చి ప్రస్తావించేటప్పుడు పితృపాదులంతా ఆమెను ఏవతో పోలుస్తూ వచ్చారు. మరియమాత స్థానం అర్థం చేసికోవాలంటే ఈ పోలికను చక్కగా అర్థం చేసికోవాలి. అంచేత ఈ యధ్యాయంలో ఈ పోలికను పరిశీలిద్దాం. ప్రస్తుతం పితృపాదుల రచనల్లో నుండి ఈ యిద్దరి ఏవల పోలికకు సంబంధించిన వాక్యాలను ఇక్కడ సంగ్రహంగా పొందు పరుస్తూన్నాం.

తొలియేవ పాపం లేకుండానే జన్మించింది. కాని ఆ భాగ్యాన్ని నిలుపు కోలేదు. రెండవ యేవకూడ పాపం లేకుండా జన్మించింది. పాపం లేకుండానే జీవించింది కూడ. కనుక ఆమె అవివేకవతి, ఈమె వివేకవతి.

తొలయేవ తాను మరణానికి లొంగివుండేది కాదు. ఆ భాగ్యదశలో ఆదిదంపతులకు చావంటూ లేనేలేదు. కాని తొలియేవ మూర్ఖురాలై పాపం చేసి మరణం తెచ్చిపెట్టుకుంది.ఐనా రెండవ యేవ పాపాన్ని ఎదుర్కొని నిలిచింది. మరణాన్ని జయించింది. దేహాత్మలతో మోక్షానికి వెళ్లింది. కనుక ఆమెకంటే యీమె ధన్యురాలు.


ఆ తొలితల్లి భౌతికంగా ఆధ్యాత్మికంగా గూడ మనకు మూతగా నియమింపబడింది. కాని యేవ ఆ యూధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయింది. మనకూ దాన్ని అందించ లేకపోయింది. కాని యీ రెండవ యేవ మాత్రం మనకు ప్రతిదినం జ్ఞానజీవితాన్ని అందిస్తూనే వుంటుంది. రోజురోజు మనకు వరప్రసాదాలు ఆర్జించి పెడుతూనే వుంటుంది. కనుక ఆ తల్లికంటె ఈ తల్లి మేలైంది. ఆమె మృతుల మాత, ఈమె జీవవంతుల మాత,