పుట:Pranayamamu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలిని పీల్చుము. అటుపైన, ఎడమ ముక్కును కుడి ఉంగరపు చిటికెన వ్రేళ్ళతో మూసి, కుడి ముక్కుగుండా గాలిని విడువుము[నెమ్మదిగా].

ఆ పిదప నీవు పీల్చ గలిగినంత సేపు కుడిముక్కుతో గాలినిపీల్చి, ఎడమ ముక్కుతో గాలిని విడువుము. ఈ రీతిని పండ్రెండు మారులు చేయుము. ఒక చుట్టు అగును. దీనిలోకూడ కుంభకము లేదు.

4 వ అభ్యాసము

అ, ఉ, మ - అను మూడు అక్షరములకు మూలము ఒకే ఒక అక్షరమగు 'ఓం' అని ధ్యానించుము. 16 సెకండ్లు(మాత్రలు) సేపు ఎడమ ముక్కుగుండా గాలిని పీల్చుచూ 'అ' ను ధ్యానించుము. ఆ పిదప గాలిని 64 మాత్రలు (శెకండ్లు) సేపు కుంభించి ఆ సమయమును 'ఉ' ను ధ్యానించుము. ఆ పైన 32 సెకండ్ల సేపు 'మ్'ను ధ్యానించుచూ గాలిని కుడి ముక్కుతో విడువుము. పై విధముగా చాలసార్లు చేయుము. మొదట 2,3 సార్లుచేసి క్రమక్రమముగ 20, 30 మార్లు నీశక్తి ననుసరించి చేయుచుండుము. ప్రారంభములో పూరక కుంభక రేచకముల నిష్పత్తి 1: 4: 2 వుండనిమ్ము. క్రమ క్రమముగ ఈమూడును 16: 64: 32 నిష్పత్తిలో వుండు నంతవరకు పెంచుకొనుచు రమ్ము.

దీర్ఘ శ్వాసాభ్యాసము

ప్రతి దీర్ఘ శ్వాసాభ్యాసమునందు ముక్కుతో నిండా గాలిని పీల్చుటయు, నెమ్మదిగ గాలిని పూర్తిగా *విడచుటయు ఆవశ్యకము.