పుట:Pranayamamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూర్చొని చిత్తమును ఇంద్రియములను వశపరచుకొని ఏకాగ్రమగు మనస్సుతో అంత:కరణ శుద్దికొరకు యోగాభ్యాసమును చేయవలెను. అప్పుడు శరీరమును, శిరస్సును, కంఠమును స్థిరముగా నిలిపి, కదలక, దిక్కులు చూడక, నాసికాగ్రమును జూచుచూ వుండవలెను.

(6 అ. 10, 11, 12 శ్లో.)

ప్రాణాయామము అన ప్రాణమును, శరీరమందలి ప్రాణ శక్తులను వశపరచుకొనుట. శ్వాసను క్రమబద్ధ మొనర్చుట. ఇది చాల ముఖ్యమగు మెట్టు. ప్రాణాయామముచే శ్వాసను వశపరచుకొనవచ్చును. అందువలన ప్రాణశక్తి కంపనములు, సాధనకు వశపడును. శ్వాస అనునది స్థూల ప్రాణముయొక్క బాహ్యరూపము. ప్రాణాయామము చేయుటచే, సరియగు రీతిని గాలిని పీల్చుట విడచుటలను నేర్చుకొనవలెను. ఇటుల చేయని వారి శ్వాసోచ్చ్వాసలు సరియగు రీతిని వుండవు.

ప్రాణమును వశపరుచుకొన గలిగినవాడు సృష్టియందలి మానసిక శారీరక శక్తులను అన్నింటిని వశపరుచు కొనగలడు. ఇతనికి సృష్టిలో వశము కాని విద్యుచ్ఛక్తి మొ. నవి కూడ పదార్థము ఏదియు లేదు.

ప్రాణమును లోబరుచు కొనుటచే మనస్సులోబడును. మనస్సు లోబడుటవలన శ్వాస లోబడును మనస్సును ప్రాణమును వశపరుచు కొనుటవలన జనన మరణ చక్రమునుండి విడిపింప బడినవాడై అమరత్వమును పొందును. మనస్సు, ప్రాణము. వీర్యములకు చాల దగ్గరి సంబంధము గలదు. ఇందులో ఏ ఒక్కటి వశపడినప్పటికి తక్కినవి కూడ వశపడును.