పుట:Prabodhanandam Natikalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామేశం :- ఎలా ఆడుతుంది, ఎలా ఆడుతుందో తెలియదు.

వేణు :- తెలియదా మామయ్యా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే మూడవస్థ లోను ఆత్మమూలంగనే శ్వాస ఆడబడుతుంది. ఆ ఆత్మను తెలుసుకొనేదే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ఆత్మే నీ శరీరములోని దేవుడు.

కామేశం :- ఆహా! అమోఘమైన రహస్యం తెల్పావురా అల్లుడూ. ఇటువంటివి దివ్యజ్ఞానియైన గురుముఖతా వచ్చివుంటాయి. ఇలాంటి జ్ఞాన విషయాలు ప్రబోధ చేసిన మీ గురువెవరో తెల్పురా, నేనుకూడ ఆనందంతో ఆయన్ని కలుసుకొని జ్ఞానం తెల్సుకుంటాను.

వేణు :- సరే! ముందు భోంచేస్తాం పద మామయ్య, తర్వాత చెప్పగలను అయినా నీవు అర్థముచేసుకుంటే, నీవు ఇప్పుడన్న వాక్యాల్లోనే ఉంది మా గురువు పేరు.

(అంతలో వేణు తండ్రి కాటమయ్య ప్రవేశించి)

కాటమయ్య :- ఒరేయ్‌ వేణు, మొన్న ఉదయమంటూ వెళ్ళినవాడివి ఇప్పుడు కనిపిస్తున్నావా? ఇంతవరకు ఎక్కడ పోయావ్‌, ఏ ఘన కార్యాలాచరించావ్‌?

పూర్ణయ్య :- నాయనా కాటమయ్య! వేణుమంచి బుద్ధిమంతుడు అవుతున్నాడురా. గురు ఆశ్రమానికి వెళ్ళాడంట చక్కని దైవజ్ఞానం తెలుసు కొని వచ్చాడు.

కాటమయ్య :- ఏమిటి నాన్నా వీడు ఆశ్రమానికి వెళ్ళాడా! అట్లయితే వేదాంతంలోకి దిగినాడన్నమాట, ఒరేయ్‌ అడ్డగాడిదలాగా లక్షణంగా తిని పనీపాటా లేకుండా ఆశ్రమాలు, గురువులు అని తిరుగుతావుంటే కాపురం చక్కబడినట్లే.