పుట:Prabodha Tarangalul.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

434. జ్ఞానము ధర్మయుక్తమైతే, ధర్మము పరమాత్మయుక్తమైనది. అన్య దేవతలను గురించి బోధించు వారు, వేదముల గురించి బోధించువారు ప్రకృతి యుక్తులే అగుదురు.

435. పురుషార్థములు నాలుగని అంటుంటారు. అది అసత్యము పురుషార్థములు రెండు మాత్రమే గలవు.

436. పురుషార్థములలో ఒకటి స్థూలార్థము నిచ్చునది, రెండవది సూక్ష్మార్థము నిచ్చునది.

437. కనిపించు తండ్రిని చూపునది తల్లి, తల్లి వలననే తండ్రి తెలియును కనుక తల్లి-తండ్రి అనుమాట ఒకటి.

438. కనిపించని తండ్రియైన దైవమును తెలుపువాడు గురువు. గురువు వలననే దైవము తెలియును. గురువు-దైవము రెండవది.

439. తల్లీ-తండ్రీ, గురువూ-దైవము అర్థక్రమమే, కానీ వరుస క్రమము కాదు. కొందరు ఈ మాటను వక్రీకరించి మొదట తల్లిని పూజించవలెనని, తర్వాత తండ్రిని పూజించవలెనని, తర్వాత గురువని, ఆ తర్వాత దైవమని చెప్పుచుందురు.

440. సర్వ ప్రపంచమునకు అధిపతి ఆదికర్త అయిన దైవమును చివరికి తోసి, కనిపించు మనుషులకు మొదటి పూజలివ్వడము అజ్ఞానమగును.

441. అవధి లేని పరమాత్మను తెల్పువాడు అవధూత, కానీ బజారులో తిరుగు తిక్కవాల్లు అవధూతలు కాదు.