పుట:Parama yaugi vilaasamu (1928).pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము.

431



మకరకుండలునకు మధుపర్క మొసఁగి
సుకుమారి నిచ్చె కృష్ణునకు నవ్వేళ
సురలోకవరుమంత్రి సుముహూర్త మనిన
నిరువు రొండొరుమోము వీక్షించుతఱిని
జలజాక్షి మున్నుగా సగుడజీరకము
చెలఁగి రంగేశ్వరుశిరమున నిడియెఁ
గవమొగుళ్ళను జంద్రికలు పర్వినట్లు
తవిలి యొండొరులమైఁ దలఁబ్రాలు నించి
కరకల్పశాఖలం గనుపట్టువిరుల
సరవిముత్తియపుసేసలు దోయిలించి
గట్టిగా నాగమోక్తప్రకారమున
గట్టిరి హస్తకంకణము లొండొరులు
నలవధూవరులఁ జయ్యన దివ్యరత్న
సలలితం బగుపెండ్లిచవికెమీఁదటను
బనుపడ గొనబు చూపట్టునుత్తరపు
కొనలుగా వేయుచుంగులచేలవఱచి
చెలువొందుపీఁట నాసీనులం జేసి
జలజసంభవుఁడు శాస్త్రప్రకారమున
ననలుని నెలకొల్పి సాంగంబు గాఁగ
మనమార లాజహోమములు సేయించి