పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము



5. మన కర్తవ్యం

"గాంధీజీ మనకు ఎలా జీవించాలో, ఎలా మరణించాలో తెలిపారు. భారత ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. లక్ష్యసాధన కోసం క్రమశిక్షణ, ఆత్మత్యాగం అవసరమని బోధించారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించుటయే మనమివ్వగల నిజమైన నివాళి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో గాంధీజీ మార్గమైన అహింస, సత్యనిష్ట ప్రేమ మార్గమే మనందరికీ జీవన విధానం కావాలి" అని ప్రధాని నెహ్రూ నివాళులర్పించారు.

తన ఒక్కమూర్తితోనే భారతకర్షకుడు, కార్మికుడు, నేతమనిషి, వ్యాపారి, యోధుడు, ప్రజాసేవకుడు, అపార కరుణాసాగరుడు గా గాంధీజీ లోకానికి ప్రత్యక్షమయినాడు. ఇంత అపారమయిన భారత ప్రజాబాహుళ్యం ద్వారా మిగతా ప్రపంచానికి అలభ్యమయిన అద్భుతశక్తి సామర్ష్యాలతో సహజ సంపదను ఉద్భవింపచేయవచ్చునని గాంధీజీ గమనించారు. ఈ సంపదకు వ్యాపార నైపుణ్యంకాని, పెద్ద పెద్ద అంగళ్ళుకాని, సామ్రాజ్య సైనిక వివాదాలుకాని, కరెన్సీ మారకంగాని, ఇన్ప్లేషన్, డిప్లెషన్లు గాని, శాస్త్ర పరిశోధనలుగాని, నవీనయంత్ర బలంగాని అవసరంలేదు. నిష్కళంకమయిన జీవితము, ఉదాత్తమయిన భావనాపటిమ, విశాలదృక్పథము, కాయకష్టము, నిజాయితీగా ధనార్థన-ఇవే గాంధీజీ విధానములోని ప్రధానలక్ష్యాలు.

గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లాను సందర్శించిన ప్రతీ పర్యాయము జిల్లా వాసులు ధనిక, పేద, స్త్రీ, పురుష, బాలురు, వృదులు, కుల, మత తారతమ్యాలు విస్మరించి ఏకోన్ముఖులైనిండుగా అలలారుతున్న ప్రేమ, భక్తి పారవశ్యంతో ఘనస్వాగతాన్నితెలిపారు. ఆయన మాటలను అమృతధారలవలె స్వీకరించారు. గాంధీజీ రాక సందర్భమున రైల్వే స్టేషనులందు, గ్రామములందు, వీధివీధినా, సందుసందున, ఇండ్ల కప్పులపైన, గోడలపైన, కొన్ని చోట్ల చెట్లపైన కూర్చుండి మహాత్ముని దర్శించి తాదాత్మ్యం చెందారు. కుంకుమ, కర్పూర హారతులు, ఫలములు, పుష్పములు, ఖద్దరు ధోవతులు, ధనము, ఆభరణములు చేతపట్టుకొని గాంధీజీకి సమర్పించుటకు గంటలకొలది నిరీక్షించారు. ఆ నిరీక్షణలో చలి, ఎండ, పగలు, రాత్రి అనే భేదమే నశించింది. గాంధీజీ పదములు తాకి పశ్చిమగోదావరి జిల్లా పుడమి పులకించింది, ప్రజలు తరించారు. ఆయన చేపట్టిన ప్రతీ ఉద్యమంనందు జిల్లా ప్రజానీకం యావత్తు నిశ్చలమైన, నిర్మలమైన హృదయాలతో

83