పుట:Oka-Yogi-Atmakatha.pdf/420

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

384

ఒక యోగి ఆత్మకథ

“కాలేజి గౌరవాలకోసం పాకులాడకుండా, నిన్ను అడ్డుకున్నది దైవాన్వేషణపరమైన తపనేకాని సోమరితనం కాదు” అన్నారు గురుదేవులు కనికరంతో. కాసేపు మౌనం వహించిన తరవాత ఇలా ఉదాహరించారు. “మీరు మొట్టమొదట దేవుడి రాజ్యాన్నీ ఆయన ధర్మాన్నీ అన్వేషించండి; అటుమీదట ఇవన్నీ మీకు అదనంగా సమకూర్చడం జరుగుతుంది.”[1]

గురుదేవుల సన్నిధిలో నా బరువులన్నీ తేలిపోవడం వెయ్యోసారి నాకు అనుభవమయింది. ఆ పూట పగటి భోజనం మేము పెందలాడే ముగించుకున్న తరవాత నన్ను ‘పాంథీ’కి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చారు ఆయన.

“నీ స్నేహితుడు రమేశ్ చంద్ర దత్తు ఇంకా మీ వసతి గృహంలోనే ఉంటున్నాడా?”

“ఉంటున్నాడండి.”

“అతన్ని కలుసుకో. పరీక్షల్లో నీకు సాయపడ్డానికి ఈశ్వరుడు అతనికి ప్రేరణ ఇస్తాడు.”

“మంచిదండి; కాని రమేశ్ మామూలప్పటికంటే ఎక్కువగా చదువులో మునిగి ఉన్నాడు. మా క్లాసుకు గౌరవకారకుడతను; పైగా అతని కోర్సు, తక్కినవాళ్ళందరి దానికన్న ఎక్కువ భారమైనది.”

గురుదేవులు నా అభ్యంతరాలన్నీ తోసి పారేశారు. “రమేశ్ నీ కోసం వెసులుబాటు చేసుకుంటాడు. ఇంక వెళ్ళు.”

నేను సైకిలు తొక్కుకుంటూ ‘పాంథీ’కి వెళ్ళాను. వసతిగృహం ఆవరణలో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి, విద్వాంసుడైన రమేశే

  1. మత్తయి 6 : 33 (బైబిలు).