పుట:Narasabhupaleeyamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరసభూపాలీయము. ఆ. 5

83

భ్రాంతిమంతము —

క.

అల యుపమేయము ఛన్నత, నలరఁగ నారోప్యమాణ మగునుపమానం
బిల నెఱుకపడగ భ్రాంతిమ, దలంకరణ మయ్యె దీని నాపాదింతున్.

56


శా.

చూడం జూడ నృసింహకీర్తిచయ మీక్షోణీనభోమధ్యమం
దేడం జూచినఁ దాన యై నెగడఁగా నీక్షించి మిన్నేట నీ
రాడం బోయెడిబేసితాపసులు మే లౌ మ్రోల సిద్ధించెఁ గా
యడం బోయినతీర్థ మంచు మదిలో హర్షింతు రశ్రాంతమున్.

57

అపహ్నవము —

క.

ఉపమేయము గా దని యిది, యుపమానమె యనఁగ నెంతయు నపహ్నన మౌ
నపు డది ప్రాగారోపము, నపహ్నవారోపమును ఛలాదియు నయ్యెన్.

58

త్రివిధాపహ్నవములు —

మ.

గురుచక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబు గా దిందుభా
స్వరకీర్తిద్యుతిపంక్తి గాదు నిబిడాంచత్పాంచజన్యప్రభా
భర మౌఁగా నటుగాన విత్వభరణప్రారంభముం గోరి యీ
నరసేంద్రాకృతి నుద్భవించెఁ గమలానాథుండు విశ్వంభరన్.

59

ఉల్లేఖము —

క.

అలరఁగ గృహీతృభేదం, బుల నొకటియె పెక్కురూపముల నెడ నెడలం
దలపోయఁగ నుల్లేఖం, బలంకరణరాజ మయ్యె నది యె ట్లన్నన్.

60


క.

బాణుఁ డని బుధులు మురజి, ద్బాణుం డని విమతభూమిపాలురు సుమనో
బాణుఁ డని సతులు దలఁపుదు, రేణాంకసమాను నోబళేంద్రు నృసింహున్.

61

ఉత్ప్రేక్ష —

క.

ఉపమేయమునకుఁ గలిగిన, యుపమానగుణక్రియాదియోగముచే నా
యుపమానమె యని తలఁచిన, నపు డది యుత్ప్రేక్ష యయ్యె నదియును ధరణిన్.

62


క.

క్రమమున వాచ్యయును బ్రతీ, యమానయును నగుచు ద్వివిధ యగువాచకశ
బ్దము గలుగ వాచ్య యనఁ దగు, నమరఁగ లేనియెడ గమ్య యనఁదగు వరుసన్.

63


సీ.

అలరెడు నీరెంటియందు జాతిగుణక్రి, యాద్రవ్యము లవాచ్యయబ్ధిసంఖ్య
యవి నాల్గు వరుస భావాభావములఁ జెంద, నిల ననుసంఖ్య యాయెనిమిదియును
నిరువదినాలు గౌ హేతుఫలస్వరూ, పముల వేర్వేఱఁ ద్రిభంగిఁ జెంద
నందు నెన్మిది యెన్మి దగుహేతువుఫలంబు, నలరు వాచ్యగుణక్రియానిమిత్త


తే.

ములఁ బదాఱు పదాఱు నౌ నలస్వరూప, గతనిమిత్తంబులకు వాచ్యగమ్యగతులు
గాగఁ బదియాఱు నగువాచ్యస్వరూప, మరయ గమ్యస్వరూప మష్టాఖ్యయయ్యె.

64