పుట:Naayakuraalu.Play.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

95

నల. రా : మొదటివొడంబడిక నే నంగీకరించను. మోసకృత్యమని వెంటనే లోకానికి వెల్లడించాను.

నాయ : అయితే రెండవదీ నిలవదు. మొదటిదానిని సౌమ్యంగా రద్దుజేయడమే రెండవదాని వుద్దేశము.

నల. రా : అనే తేలుతున్నది.

నర : అని తేలితే, వారు రమ్మని పిలిచిందాకా వూరుకోక సమయం చూచి దెబ్బగొట్టడమే నీతి.

నాయ : అంతయోచన యిప్పుడు వద్దు. వారిని దూరంగా గొట్టేయోచన ప్రస్తుతం జేయాలె.

నర : వూరికే పొమ్మంటే పోతారా ?

నాయ : వూరికే పోనిమాటే ; వీరు మండాదిలో వేయిజనం కాపురం వుండడం, వేలకొలది పశువులను దౌర్జన్యంజేసి చుట్టుపట్ల మేపడం, అడవులలోవున్న చెంచుజనానికి పోడుగా వున్నది. వారి నుసికొలిపితే మన ప్రమేయంలేకుండా మూడురోజులలో లేవగొడతారు. చెంచులు బాధపడుతున్నారని తెలిసి నాయకుణ్ణి పిలిపించా. ఇప్పుడు కచేరి హాలులో తమ దర్శనంకోసం కాచుకొనివున్నాడు.

నల. రా : తక్షణం పిలిపించండి.

నర : ఎవరురా అక్కడ ? చెంచునాయకుణ్ణి లోపలికి రమ్మను

నౌకరు : చిత్తం.

[ చెంచునాయకుడు ప్రవేశము ]

చెంచు : సామీ, దణ్ణం ; నీ పాదాలకాడివాణ్ణి. తమ దర్శనానికి చందమామకోసం వెన్నెలపిట్టలాగ కనిపెట్టుకొని వున్నా.