పుట:Naayakuraalu.Play.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

నాయకురాలు

బ్రహ్మ : తమరు అనవసరంగా భయపడుతున్నారు. ఇవి మనవాండ్లలో పౌరుషం పూర్తిగా పెంచవలసిన రోజులు. కోడి పందేలే వీరులను తయారుచేసే గురుకులాలు.

మ. దే. రా : నిశ్చయం. కోడిపందేలే లేకపోతే యింతమంది వీరులు మనవైపు లేకనేపోదురు:

అ. రా : మానాన్నగారు చెప్పినదే వాస్తవం. దీనిమూలంగా కలహాలు పెరిగితీరుతవి. అలగాజనం చెప్పినట్టురారు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు.

బ్రహ్మ : నలగామరాజుగారికి పందెములంటే చాలాయిష్టం. ఏది వొడ్డుదామన్నా సరేనంటారు. విరోధాలకు బదులు యిటువంటి సమావేశములవల్ల యితరరాజులతోగూడ సఖ్యం కుదుర్చుకోవచ్చు.

మనం ప్రస్తుతం సిబ్బందితక్కువవాండ్లం. పందేలలో సరదాగల రాజులందరినీ మనవైపుకు లాగగలను. ఇది మన చేతులలోవున్న బలమయిన సాధనం. దాన్ని వుపయోగించడమే నీతి. మన అదృష్టం బాగావుంటే యేది యెట్లా జరుగుతుందో చెప్పలేము.

మ. దే. రా : నిశ్చయం

అ. రా : మాకు వ్యాయమని తోచింది చెప్పాం.

కొమ్మ: తమ చిత్త ప్రకారం కానియ్యండి.

బ్రహ్మ: ప్రభువుగారి అభిప్రాయమేమి ?

మ. దే. రా : తప్పక మనం పరివారసహితంగా పోయి పందెం పెట్టవలసిందనే. వెనుకడుగు వద్దు.

అందరు: చిత్తం.