పుట:Naayakuraalu.Play.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

57

         చన్నకృష్ణుని - చక్కదనంబును - సందర్శింపగ రండు
         ముద్దుకృష్ణుని మురళీనాదము - మోగుచుండు వినుడు
                  తలచిన - తలపు లెరుగు నతడు
                  పిలువక - పలకరించువాడు
                  పేదల - పెద్దజేయు ఘనుడు
         పండిత పామర భేదంబులను పాటింపనివాడు.

క. దా : ఆహా ! నా హృదయం పొంగిపోతున్నది. ఏడీ చెన్నకేశవుడు ? సేవించంది నే వుండలేను.

బ్రాహ్మణుడు : ఎట్లా సేవిస్తావు ?

క. దా : వెళ్లి ఆలింగనంచేసుకుంటా. అంతటితో నా తాపము. ఆరిపోతుంది. అయ్యో నే భరించలేను.

బ్రాహ్మ : జన్మానా స్నానం జెయ్యని యీ మురికిశరీరంతో నేనా, నీవు ఆలింగనం చెయ్యడం ? చెన్న కేశవుడు మైలబడడూ ?

కన్నమదాసు: మైలబడతాడా, అయ్యో! మరెట్లా? దూరంగావుండి రెండు పూలు ఆయన పాదాలమీదపెట్టి చిన్నంగా వత్తుతా.

బ్రాహ్మ: నీ చేతు లొంకా తోళ్లకంపుకొడుతూనే వున్నవి. వాటితోనే అంటుకుంటావూ ?

క. దా: స్వామి సన్నిధిలో ఆయన వినేటట్టుగా కీర్తనలయినా పాడుకుంటా.

బ్రాహ్మ: బ్రాహ్మణుల నోట వచ్చే సామగానాలు వినేవాడు, నీ బొల్లిపాటలు వినవచ్చాడా ?

క. దా : అయ్యో, వినడా, మఱి నా గతేమి ? పోనీ ఎదటికిపోయి కండ్లతో నయినా చూస్తా. ఆ రూపం కండ్లతో జూచి ఆనందిస్తా.