పుట:Naayakuraalu.Play.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

39

నర : మన బలాబలా లిప్పుడు తేలవు. నాగమ్మగారికి అమాత్య పదవీ, సర్వసైన్యాధిపత్యమూ ఇయ్యంగనే మన సేనలు ఇబ్బడి ముబ్బడి గాకమానవు.

నల : ఏమి కేతురెడ్డీ ! నీ అభిప్రాయమూ అంతేనా ?

కే : చాతుర్వర్ణ్యముల సంగతి అట్లావుంచినా పల్నాటి రెడ్లందరూ నాగమ్మ బావుటాకిందికి చేరకమానరు.

నల : అంతమటుకు నిశ్చయమే.

నర : ఆమె మతప్రచారంకూడా మనకు తోడ్పడుతుందనే నా అభిప్రాయము. కులభేదాలకు నాయుడు పూలుముడుచుకొని కూర్చొనడంచేత వర్ణాశ్రమధర్మాలు సంరక్షించడానికి బద్ధకంకణురాలైన మంత్రి తప్పక మన రాజ్యమునకు పెట్టనికోట.

నల: నాకు తెలిసినంతవరకు సర్దార్లు నాగమ్మగారివైపే మొగ్గు ; కొందరు సాధ్యమైతే బ్రహ్మనాయుడినే మంత్రిగా నియమించమంటారు. అది పొసగదు. పొసగినా మన రాజ్యాని కది క్షేమముకాదు. మీ ఇద్దరి అభిప్రాయముగూడ తేల్చి చెప్పండి.

నర : నాగమ్మగారికి సర్వాధికారములిచ్చి కార్యం గట్టెక్కించమని కోరడం నా యభిప్రాయం.

కే : పల్నాటిక్షేమంగోరేవా రందరూ ఆ యభిప్రాయంతో ఏకీభవించక తప్పదు.

నల : నేనూ అదే నిశ్చయించా. ఇట్టి సమయములలో బహునాయకం పనికిరాదు. ఇక మనకు ఆమెయే నాయకురాలు. నేనూ ఆమె ఆజ్ఞలకే కట్టుబడివుంటాను.