పుట:Naayakuraalu.Play.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xv

ములై , చాపకూడు ఇత్యాదులగు సంకేతములద్వారా సత్యములుగా నుండుటచేత, చారిత్రికదృష్ట్యా ఈ గ్రంథకర్తకు వాటిని కూర్పక తప్పినదికాదు. ఈ నాటకమునందు బ్రహ్మనాయుని, తదనుచరులను దిద్దితీర్పుటలో వారి నోట పల్కించిన యాదర్శవాక్యములు ఇప్పు డీ ఇరువదవ శతాబ్దిలోని గాంధీమహాత్ముని యుపదేశములను ప్రతిపదమునందును స్ఫురణకు తెచ్చుచున్నవి. ఇట్టులనే, నాయకురాలి విషయములో గూడ ఆబాలగోపాలమును వర్ణాశ్రమధర్మరక్షణపరత్వము మారుమ్రోగునట్లు చేసినారు. ఈవిధముగానే ఈ నాటకమునందు ప్రధానపాత్రములను, ఉపపాత్రములను మొదలగు నన్ని యంగములను సంపూర్ణముగా తీర్చికూర్చుటలో శ్రీ పంతులుగారు కనబఱచిన ప్రజ్ఞావిశేషము ఎంతగా చెప్పినను, వ్రాసినను ఏమాత్రమూ తరగునది కాదని మనవిచేసికొనుచున్నాను.

ఇకను పాత్రపోషణవిషయమును ముగించుటకు ముందుగా నొకమాటను చెప్పవలసియున్నది. సాధారణముగా నింతవఱుకును మన నాటకములలో అంకముల సంధులను అతికి కథాంశములను పొందించుటలో సంస్కృతభాషామర్యాదను విష్కంభములను వ్రాయుట మనవారి యాచారమైయున్నది. కాని యిందులో మాత్రము విష్కంభమన్న పేరుతో ప్రత్యేకముగా అంకముల సంధులను కూర్చినను. కూర్పకున్నను ప్రతాపు డనుపేరుతో కాలపురుషునొకనిని ప్రవేశపెట్టుచు విష్కంభములేని కొరతను దీర్చి క్రొత్తపుంతను ద్రొక్కినారు. అయినను విష్కంభముయొక్క యాశయము లిందు గానరావు. వీ రీ నాటకములో అంకసంధులలో ప్రతాపపాత్రమును ప్రవేశపెట్టినప్పుడెల్లను ఆ పాతముద్వారా అత్యుత్కృష్టములును, ప్రకృతిశాస్త్రై కగమ్యములును, తీవ్రమగు మనీషతో విచారణచేసిన గాని బోధపడనట్టివి అగు కొన్ని యాదర్శప్రాయములగు సిద్ధాంతములను వెల్లడించుటలో ఈ ప్రతాపుని సంభాషణవాక్యములు జీవగఱ్ఱలై వెలయుచున్నవి. అగుట కీ వాక్యములు సాధారణ జనులకు అంతగా బోధపడునవి కాకపోయినా, స్థూలదృష్టులకు