పుట:Naayakuraalu.Play.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాయకురాలు

119

పుఱ్ఱెలమయమయినది. సైనికు లవి చూచి వొళ్లు మరచి వున్మత్త పిశాచములవలె ఒండొరులు దలపడి, హతము గావించుకొని పనలు పనలుగా పడిపోయినారు. సేనాముఖమంతా పలచబడ్డది. తుదకు తెగిపడిన మొండెములు దప్ప, సవ్యముగ వున్న కళేబర మొక్కటీ గన్పడలేదు. శవముల కుప్ప లడ్డమయి సైన్యము ముందుకు సాగివచ్చుటకు వీలు జిక్కక కొంతవడి యుద్ధము నిలిచిపోయినది.

య : రణరంగ మెంత బీభత్స మయినది ? నే వెళ్లి పాల్గొనిన బాగుండు. నా కవకాశము కలుగకముందే యుద్ధము ముగుస్తుందేమో?

నల. రా : తొందరపడవద్దు. తరువాత నేమి జరిగినది ?

ఝట్టి : యుద్ధమును సువ్వీ అని మొదలుబెట్టిన బాలచంద్రుడే, చాకల చందన్న, మంగలి మంచన్నలను రెండుపక్కల నిడుకొని, పీనుగుల తిప్పలెక్కి దుమికి అడ్డమువచ్చిన సైనికుల చించి చెండాడుతూ, మన వాహినీపతి యయిన చింతపల్లిరెడ్డిని దలపడగా ఆత డా మువ్వురు వీరులతో కొంతవడి పోరి పాటవము చెడి పలాయనము కాబోగా మన చమూపతి కొదమగుండ్ల నరసారెడ్డి బాసటయినాడు. బాలుని కడ్డము వచ్చి, చిత్రగతుల యుద్ధపాండిత్యము జూపి, రెండమ్ములు బరపి చందన్నను సమయింపజేసి, ఈటెపోటుతో మంచన్నను నేలకు దెచ్చాడు. వారి ఇర్వురిపాటు జూచి బాలుడు తోకతొక్కిన తాచై నరసారెడ్డి నొడిసి పట్టుకొని ద్వంద్వయుద్ధమునకు దలపడగా పెద్దమలినీడు చింతపల్లిరెడ్డికి అడ్డము వచ్చాడు. రెడ్డియును నిలువరించుకొని యెదురుతిరిగి రాగా కొంతవడికి బాలచంద్రు,