పుట:Naayakuraalu.Play.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

నాయకురాలు

అడవులలో తిరిగే చెంచులు మనలను జూచి బెదిరి పరుగెత్తుతూ వచ్చారుగాని యే ఆటంకము కలిగించలేదు.

మ. దే. రా : అడవు లొకరి సొమ్ము గనుకనా ? ఆక్రమించు కొన్న వాడే అధికారి.

క. దా : కాని వారమురోజులనుంచీ వారి నడవడి మారిపోయినది. మేతకు దూరముగా బోయిన మందలపైబడి చెంచులు వందలకొలది ఆవులను తొలగదోలుకొని పోతూ వచ్చారు. అది కని పెట్టి లంకన్న మూడురోజులనుంచీ ఆవులను చెదరిపోనీక సమీపమున మేపుకొని మబ్బుపడక పూర్వమే తొఱ్ఱుపట్లకు జేర్చి తెల్లవార్లూ కావలిగాచి, దొంగలకు అసిఆడకుండా చేశాడు. ఈ మూడురోజులూ ఒక్క జీవమయినా జాయా బోలేదు.

మ. దే. రా : లంకన్నయొక్క శక్తిసామర్థ్యములు మనకు దెలియనివా?

క. దా : కడచినరాత్రి చెంచులు యెత్తుమార్చి గుంపులు గుంపులుగా విల్లంబులతోను ఖడ్గములతోను బయలు దేరి ....

బ్రహ్మ : వారికి ఖడ్గము లెక్కడివి ?

క. దా : అదే చెప్పబోతున్నాను. దెబ్బతిని మాచే జిక్కిన చెంచును ప్రశ్నిస్తే తమ నాయకుడు గురిజాల బోయి నాయకురాలిదగ్గిర 200 కత్తులు దెచ్చినాడనీ, తమకు చేజిక్కిన పసరములలో సగము గురిజాలకు తోలిపెడుతున్నాడనీ చెప్పినాడు.

మ. దే. రా : సరే, కథకు మూలము దెలిసింది. తరువాత.