పుట:Naayakuraalu.Play.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

పట్టణములో ప్రవేశించి, అచ్చట స్థిరనివాస మేర్పఱచుకొని కాలమును త్రోయసాగెను.

"బలవత్స్వామిక మవిశుద్దాగమనం ధనం భుంజానస్యకుతో మనస్సమాధిః ” (బలవంతులైన సొంతదారులు గలిగియుండి అక్రమరీత్యా చేజిక్కినదానిని అనుభవించువానికి ఎంతటి ప్రాముఖ్య ప్రాబల్యము లున్నను మనశ్శాంతి చేకూరుట ఎట్లు ?) అని భారవి మహాకవి చెప్పినట్లు నాయకురాలు ( ఈమెయొక్క నిజమైన పేరు నాగమ్మ. గామాలపాడు ఈమె జన్మస్థానము. తండ్రిపేరు రామిరెడ్డి ) బ్రహ్మనాయుడు తన కెప్పటికైనను కంటిలోని నలుసులాంటివాడే అనిన్నీ, ఎట్లైనను అతనిని లేకుండ చేసినచో తన బాహటాకు అడ్డు లేదనిన్నీ తలంచి తాను మంత్రిపదవికి వచ్చినది మొదలుకొని ఎటులయినను బ్రహ్మనాయుని, అతని పరివారమును తుదముట్టింపవలయుననిన్నీ దృఢము జేసికొన్నది. కనుకనే నలగామరాజుపట్టాభిషేక కాలమున కానుకల నర్పింపవచ్చిన బ్రహ్మనాయునికి విషము పెట్టించినది. ఇంకను ఎన్నెన్నో మాయోపాయములు చేసినది. కాని పాండవులయెడల ధార్తరాష్ట్రు లవలంబించిన వంచనకృత్యములవలె నవి యన్నియు నిష్ఫలములైనవి. చివఱకు కోడిపందెము లనే మిషపెట్టి బ్రహ్మనాయుని, తదనుయాయులను రప్పించి, కౌరవులవలెనే తానును వారిని ఆ మాయాద్యూతమున నోడించి, ఏడు సంవత్సరములు అజ్ఞాతవాసము చేయించినది. బ్రహ్మనాయుడు తన అనుయాయులతో ఆ కాలమున మండాదికి వలసపోయెను. నాయకురాలు అచ్చటకూడ కౌరవులవలెనే ఆటవికులనుప్రేరేచి అతని ఆవులమందలను చంపించుట మొదలయిన ఘోరకృత్యములను చేయించి, నానా బాధలు పెట్టినది. చివఱకు ఎట్లయిననేమి అనుకొన్నట్లు ఆ యేడేండ్లు గడపిన తరువాత పాండవులవలెనే బ్రహ్మనాయుడు మొదలయినవారు గూడా తమభాగమును తమకు స్వాధీనము చేయవలసినదని అలరాజు ద్వారా రాయబారమంప, కృష్ణరాయబారమువలె ఆ ప్రయత్నము వృథ అయిపోయినందున, ఆంధ్రదేశపు కురుక్షేత్ర మనదగిన నాగులేటి