పుట:Mana-Jeevithalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాన్యత

25

కూడబెట్టటం అనేది మనల్ని మనం సంకుచితం చేసుకునే చర్య. ఇది మన రక్షణ కోసం ప్రతిఘటించటానికే. జ్ఞానం ఈ చర్యను లేదా ప్రతిఘటనని మరింత శక్తిమంతం చేస్తుంది. జ్ఞానాన్ని ఆరాధించటం కూడా దేవతా విగ్రహాన్ని ఆరాధించటం వంటిదే. అది మన జీవితంలోని సంఘర్షణనీ, దుఃఖాన్నీ రూపుమాపలేదు. అంతకంతకు అధికమయే మన గందరగోళాన్నీ, విచారాన్నీ జ్ఞానవస్త్రం కప్పిపుచ్చుతుందే గాని, వాటి నుంచి మనకి విముక్తిని ప్రసాదించదు. మనోరీతులు సత్యానికీ ఆనందానికీ దారితీయవు. తెలిసి ఉండటం అంటే, తెలియని దాన్ని వద్దని అనుకోవడమే.

10. మాన్యత

తనకు దురాశ లేదనీ, కొంచెంతోనే తాను తృప్తిపొందుతాననీ, మామూలుగా మనిషికొచ్చే కష్టాలు కొన్నిటిని అనుభవించినా మొత్తం మీద తన జీవితం బాగానే గడిచిందనీ సమర్ధించుకుంటూ చెప్పాడాయన. ఆయన నెమ్మదస్తుడు. ముందుకి తోసుకొచ్చే రకంకాదు. తాను పట్టిన మార్గానికెవ్వరూ అడ్డురాకూడదని ఆశిస్తాడుట. తనకేవీ పెద్ద ఆకాంక్ష ల్లేవన్నాడు, కాని, తనకున్న దానికోసం, తన సంసారం కోసం, జీవితం సాఫీగా సాగిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థించాడు. సమస్యల్లోనూ, సంఘర్షణల్లోనూ తన స్నేహితులూ, బంధువులూ మునిగిపోయినట్లు తన్ను ముంచనందుకు దేవుడికి కృతజ్ఞత తెలుపుకున్నాడు. ఆయనకు క్రమంగా మంచి మాన్యత లభిస్తోంది. పై తరగతికి చెందిన వాళ్లలో తానూ ఒకడినయానన్న ఆలోచనతో ఆయన ఆనందంగా ఉన్నాడు. పరస్త్రీ వ్యామోహం లేదుట ఆయనకి, ఆయన సంసార జీవితం ప్రశాంతంగానే సాగిపోతున్నదట. ఏవో సాధారణంగా భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు మినహాయించి, ప్రత్యేకమైన దురలవాట్లేమీ లేవుట ఆయనకి. తరుచు ప్రార్ధన చేస్తూ ఉంటాడుట. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడుట. "ఇదేమిటంటారు? నాకేవిధమైన సమస్యలూ లేవేం?" అని అడిగాడు. సమాధానం కోసం ఆగకుండానే, తృప్తిపడుతున్నట్లుగానూ, ఏదో దైన్యం ఉట్టిపడుతున్నట్లుగానూ చిరునవ్వు నవ్వుతూ తన గత చరిత్రంతా చెప్పటం మొదలుపెట్టాడు - ఆయన ఏం పనిచేస్తూ ఉండేవాడో.