పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

మహాపురుషుల జీవితములు

రంగనాథునికిఁ దండ్రి యింటివద్ద శ్రద్ధతో జదువు చెప్పు చుండెను. రంగనాథము మొదలియారునకు ద్రవిడభాషలో నిరుపమానమైన ప్రవేశము కలదు. అట్లు కలుగుటకు దండ్రి యింటివద్ద స్వభాషలోఁ జేయించిన పరిశ్రమయె కారణమని మన మూహింప వచ్చును. 1860 వ సంవత్సరమున రంగనాథము మదుమూడేండ్ల ప్రాయమువాడై నప్పుడు తండ్రి పచ్చయప్పగారిబడికి చదువనంపెను. అప్పుడతఁడు మూడవతరగతిలో జేరెను. అది యిప్పటికి నాలుగవ ఫారమునకు సమానము. ఆనాటి హిందువులకు పచ్చయ్యప్ప పాఠశాలమీద మిక్కిలి యభిమాన ముండినందున బాలురందఱు నక్కడికే బంపబడుచు వచ్చిరి. రంగనాథుని బుద్ధికుశలత సంపంగి పూవు పరిమళమువలె వ్యాపించుటచే నాపాఠశాలకుఁ బ్రధనోపాధ్యాయుఁడు (ప్రిన్సిపల్) వానింగూర్చి విని మిక్కిలి శ్రద్ధ బూనెను. ఆ సంవత్సర మతఁ డరువదిరూపాయల విద్యార్థి వేతనము సంపాదించెను. సంవత్సరాంతమందైన పరీక్షలో రంగనాథముజూపిన తెలివికి సంతసించి యధికారులు నడుమతరగతిలో జదువకుండగనే వానిని బ్రవేశపరీక్ష తరగతిలో (మెట్రిక్యులేషన్) జేర్చిరి.

ఈ తరగతిలోనుండి యతఁ డనేక బహుమానములం బడసెను. రాజా మాధవరావుగారు గణిత శాస్త్రమునందు నింగ్లీషు భాషా పాండిత్యమునందు మొదటివాఁడగు వానికి నొక బహుమాన మియ్యఁదలచి యా తరగతి బాలుర నందఱఁ బరీక్షింపఁ జేసెను. ఆ పరీక్షలో రంగనాథుఁడే మొదటివాఁడుగఁ గృతార్థుడై బహుమానము గ్రహించెను. ఆకాలమున రంగనాథ మొక చిన్న సాహసము చేసెను. దానింబట్టి యాతనికి తన సామర్థ్య మందెంత విశ్వాసము కలదో యెంత నిర్ణయత్వము స్వతంత్రబుద్ధి వానికడ నున్నవో మనము తెలిసికొనగలము. ఒకసారి స్త్రీ విద్యనుగూర్చి