పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాజా సర్ రామవర్మ

ఈరామవర్మ వెనుకటి తిరువాన్కూరు మహారాజు. ఈయన 1837 వ సం|| మేనెల 19 వ తారీఖున జన్మించెను. ఆయన తండ్రి గొప్ప సంస్కృత పండితుఁడు. ఇంగ్లీషుగూడ సాధారణముగ నతడు వ్రాయఁ జదువ నేర్చుకొనెను. ఆయన తల్లి రుక్మిణీభాయి సంస్కృతమునందు మంచి సామర్థ్యము గలదై మృదుమధుర శైలిని కవిత్వముఁగూడ చెప్పుచు వచ్చెను. ఆదంపతుల కేడుగురు బిడ్డలు కలిగిరి. అందు మువ్వురు చిన్న తనమందెమృతినొందిరి. ఇద్దరు పిచ్చివారైరి. రామవర్మ కడసారపుబిడ్డఁడు. ఆమృతినొందిన పిల్లలు మువ్వురొక్కమారే రామవర్మజననమున కాఱుదినములు ముందుగ గతించిరి. అందుచేత రామవర్మతల్లి యీబిడ్డనిం గనునప్పటికి మహా దుఃఖ సముద్రములో మునిగియుండెను. తల్లి యవస్థ యట్లుండుటచే నపుడుద్భవించిన రామవర్మ దుర్బలశరీరముతోఁ బుట్టెను. ఈతఁడు పుట్టిన రెండునెలలకే తల్లి మరణ మొందెను. దీనిచేత నతఁడు మఱింత దుర్బలశరీరుఁడయ్యెను. అందుచేత నాబాలుని సంరక్షణము పెద్ద మేనత్త యగు రాణీ పార్వతీభాయి పాలఁ బడియెను.

రామవర్మ యైదేండ్ల బాలుఁడై నప్పు డక్షరాభ్యాసము చేసి తండ్రి సంస్కృతము మళయాళము వానికిఁ జెప్పింప నారంభించెను. అతడు తొమ్మిదవయేట వెనుకటి దివా నగు సుబ్బారా వనువానివద్ద నింగ్లీషు చదువఁ బ్రారంభించెను. ఈసుబ్బారావు కొంతకాల మీ సంస్థానములోనే దివానుపనిచేసి యుద్యోగము మానినపిదప రామవర్మ మేనమామల కింగ్లీషు చెప్పెను. అతని నిప్పటికి నాప్రాంతపు జను లింగ్లీషు సుబ్బారావని చెప్పుకొనుచుందురు. బాల్యమునందు