పుట:Krxshhiivaludu (1924).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడ దెగ రువ్వెదేల మగువా, యిటులం బడుచుందనాల తుం
దుడుకుదనంబు నీయెడద తొందరవెట్టెనె? నైజమేగదా! 34

ఐన నయ్యెగాని, యాఁకలి బలుదొడ్డ,
రెండు కంకు లిమ్ము రెడ్డిపడుచ,
ప్రొద్దువోవు మాదు పొలిమేర జేరను,
బాట నడచి నడచి బడలె మేను. 35

అని కడువేడు పాంథులకు నచ్చట చేతికినందు కంకులం
దినుఁడని చెప్పి మంచెపయి తియ్యనిరాగము దీయు ప్రాయపుం
గొనబుమిటారి, నీ మనసుకుందు నెఱుంగదుగాని, యింటిలో
ననయము లేమిడిన్‌ సయిచు నమ్మవెతల్‌ దలపోయ వేలొకో? 36

చిన్నప్రాయమందె చీడపుర్వును దెచ్చి
నీదుహృదయకళిక నిలుపఁదగదు,
పచ్చపైరుచేల బాంధవ్యమునఁ జేసి
పెరిగినావు ప్రకృతిబిడ్డ వోలె. 37

పూలకారుగాలి పొలముపై వీతెంచె
వలపు మొలచి యొడలు పులకరింప,
మనసుకోఁతలెల్ల మానిపోఁ గోయిలఁ
గూడి పాడు మొక్క క్రొత్తపాట. 38