పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీపధారులు (చూ. చివరిఅట్ట)

1. తిరుపతి వేంకటకవులు (1870 - 1950)

దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872–1919) చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి (1870-1950) తెలుగులో జంటకవుల సంప్రదాయానికి మూలస్తంభాలు. తెలుగు పద్యాన్ని అవధానాల ద్వారా, నాటకాల ద్వారా వీధివీధిన గొంతుగొంతున నడిపించిన వారు, పలికించినవారు వీరికి ఉన్న శిష్యపరంపరాస్థి అరుదైనది

2. వేదము వేంకట రాయ శాస్త్రి (1853-1929)

భాషలా - తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, తమిళము, కన్నడము, హిందీ. అధ్యయనమా-షట్శాస్త్రములు, షడ్దర్శనాలు, అష్టాదశపురాణాలు మున్నగు సమస్తము. సాహితీ వ్యవసాయమా-రచన, వక్తృత్వము, విమర్శనము, అనువాదము, వ్యాఖ్యానము, ప్రచురణము. ఏ రంగంలో కూడా ఇంతటి పెద్దదిక్కు సంభవం అపూర్వం.

3. "కావ్య కంఠ" వాసిష్ఠ గణపతి ముని (1878-1936)

ఈ పేరులోని "గణపతి” అనే నాలుగు అక్షరాలు తప్ప మిగిలినవన్నీ ఆయన (“నాయన”) అర్హతలకు అనుగుణంగా చేరిన బిరుదులే. సంస్కృతంలో అవధానం, ఆశుకవిత ప్రదర్శనలుగా నిర్వహించగా నవద్వీపంలో చేరినది 'కావ్యకంఠ'. రమణ మహర్షి ప్రేమ పరాకాష్ఠ ఆయన నోట 'నాయన' అయింది జన ప్రియత్వ గౌరవ వచనం 'ముని'. ఎన్ని ఉన్నా తెనుగు, సంస్కృత భాషలలో విస్తరించిన అలనాటి కవిత్వంపై ఉండిన వాత్సల్యం ఆయన ప్రాణప్రదంగా మనకు దయచేసినారు.

4. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ (1893-1979)

సంగీత, సాహిత్యరంగాలలో ఎంతటి సమధిక పారీణధురీణుడో సారస్వత విమర్శనలో సంగీత విశ్లేషణలో అంతటి అవధాన కేసరి. సంస్కృత, కన్నడ, ఆంధ్ర భాషల పండితుడు. అన్నమాచార్య సంకీర్తనలకు తొలిసారిగా స్వరవ్యాకరణం సమర్పించారు.

5. కాశీ కృష్ణాచార్యులు (1879-1967)

బహుముఖ విద్యా ప్రజ్ఞ, బహువృత్తి పారంగత్వం గల అరుదుగని. అందులో గాత్ర సంగీతం, వేణువీణావాయులీన మృదంగాది వాద్య సంగీతం; వడ్రంగం, కమ్మరం, నేత, ఈత, పాకశాస్త్రం సాముగరిడీలు మొదలైన వృత్తుల విద్యలు ఉండినవి. వక్త, శతావధాని, ఆశుకవి. ఆంధ్రప్రదేశ్ తొలినాటి ప్రభుత్వ ఆస్థాన కవి.

6. కందుకూరి వీరేశలింగం (1848-1919)

సాహిత్యాన్ని సంఘసంస్కరణ సాధనంగా స్వీకరించి బహుప్రక్రియల ద్వారా ప్రబోధించిన వైతాళిక మహోదయుడు. తెలుగు కవుల చరిత్రను గ్రంధస్థం చేసి ఆంధ్ర సాహిత్య చరిత్రలో స్థిర పీఠాన్ని అధిష్ఠించి ఆమరణాంతం సామాజిక ప్రయోజనకర రచననే ఊపిరిగా చేసుకున్న మహనీయుడు.

7. రాయప్రోలు సుబ్బారావు (1892-1984)

ఏ దేశమేగినా ఎందు కాలిడినా భారత మాతను స్తుతించమని ఉద్బోధించిన స్వయంభూకవి. నవ్య కవిత్వోద్యమానికి ఆద్యుడు, ప్రభావకరుడు. తెనుగు తోటకు రమ్యాలోకతృణ కంకణాన్ని సమర్పించి తెలుగు కవితను ఇతర భారతీయ భాషలకు పరిచయం చేయించిన శుభ్రరాయుడు.