పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
293

రామలక్ష్మణుల నిరుగెడల నిడుకొని చను విశ్వామిత్రునిట్లు వర్ణించిరి:-

కనుఁగవ శోణకాంతు లెసఁగన్ ధనువుల్ శరముల్ కరంబులం
దున వెలుఁగన్ జగంబు లొక తూరియె గెల్చెడి పెంపుఁ జెల్ల న
ల్లన నల రామ లక్ష్మణు లలంఘ్యులు వారిరుప్రక్కలం దగన్
మునివరుఁడొప్పె శృంగయుగముంగల మత్త వృషంబు కైవడిన్.

రాముఁడు సుబాహుని జంపుటను గూర్చియిట్లు వక్కాణించిరి:-

తా సుబాహుఁడైన నీ సుబాహుళ్యంబుఁ
జేసి యా సుబాహు క్షితినిఁ గూల్చెఁ
దన సమాఖ్య వాఁ డితండంచు నెంచక
క్షత్రధర్మమెంత చిత్ర మహహ!

శ్రీరాముడు శివధనుర్భంగమునకై లేచునపుడు సీతకును దత్యఖికి ప్రసంగము జరిగినట్లు మనోహరముగఁ గల్పింపఁబడెను:-

సీతశంక:-

మగఁ డీతండగు నీ కటంచనెదు కొమ్మా! తమ్మిపూఱేకుఁ బో
ల్పఁగనౌ‌మేను గలట్టి యీ సరసుఁడే లావంది ముక్కంటి విం
టీ గుణం బెక్కిడు నొక్కొ! యుక్కుగల మన్నీ లెందఱో చేరి సి
గుఁగొనం జూడమె? యింత భాగ్యమిఁక నాకున్ దక్కునే? నిక్కమే!

ఇందులకు సఖి చెప్పిన సమాధానము:-

విరులనువ్రాలి సోయగము వ్రీలకయుండ మరందమాను న
త్తఱి మృదులంబునై, యులివిధంబున దారువునంటఁ దొల్చుచోఁ
గరము గరోరమౌ యలి ముఖంబున నీ సుకుమారమౌళి సుం
దరతర మూర్తి యుగ్రమగు ధర్మముఁ బూన మహోగ్రమౌ జుమీ!