పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
154

40. శ్రీ రాజావారి మేనగోడలు

క్రీడదయివాఱ గోపాలకృష్ణు తోడఁ
బుట్టువందు సుభద్రను బోలఁజాలు
పాపమారావునకు నిఁకఁ బార్థుఁబోలు
పతిని సమకూర్పుమో నాగపార్ధివేంద్ర!

41. ప్రకృత రాజదంపతులవలెఁబార్వతీ పరమేశ్వరులను సేవించినవారెవ్వరు?

సురనాథుండు శచీపురంద్రియు, మనశ్శుద్ధుల్ విడంబింప భా సురసౌధాంతరచంద్రకాంతశకలాస్తోకప్రదేశంబులం
బరమేశీపరమేశులంగొలిచి రాఫక్కిన్, భవానీమహే
శ్వరులంగొల్చినరాజదంపతు లభీష్టశ్రీలఁజెన్నొందరే?

42. శక కర్తయగు శాలివాహనుఁడు

పురుషరూపముఁగొన్న భుజగేంద్రుఁ గూడిన
          యవివాహితకు సముద్భవము జెందె
ఎముక, బొగ్గులు, మృత్తు, నుముక, మంచపుఁగోళ్ల
          క్రింద నుంచిన వైశ్యు కీలెఱింగె
పశు లోహ భూ ధాన్య భాగంబు లెఱింగించి
          విశ్వ వేదిత్వంబు విశదపఱచె
నాగేంద్రుకరుణ, మృణ్మయసేన వజ్ర మ
          యంబుగా నని విక్రమార్కు గెల్చె

వసుధఁ బాలించె నేకోష్ణవారణముగ
నేఁటికిన్ శకకర్తయై పాటికెక్కె
నతఁడు శేషాంశజుండు, పూరితయశుండు
శాలివాహననామ రాట్చంద్రుఁ డనఘ!