పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

145

15. పాండవులు, స్వస్వప్రభావములచేఁ బ్రసిద్ధిఁబడసి, ప్రస్తుత ప్రభువై యవతరించినట్లు

వరధర్మప్రతిపాదనవ్రతమునన్, వైరిచ్ఛటాగర్వ ని
ర్హరణాత్యుగ్రబలాఢ్యతన్ వివిధలక్ష్యజ్ఞాగ్రగణ్యప్రదం
దురగారోహణ నైపుణిన్ సురభిసంతోష క్రియంబాండుభూ
వరపుత్రుల్ యశమొంది నీవుగ జనింపంబోలు నేకాకృతిన్

16. దసరామహోత్సవములం జూడవచ్చిన జనులు

నాగవాసములసౌందర్యంబు సంగీత
          మాసక్తిఁగని విని యలరువారు
చర్మనాటకములుత్సాహంబుతోఁగాంచి
          పోలుగాడుండమిఁ బొక్కువారు
గజములఁబులుల నక్కజమారఁ జేరి త
          దారవంబులకుల్కి పాఱువారు
శతవధానముఁ జూడఁజాలితిమీనాఁటి
          కంచు భూపాలుఁ గీర్తించువారు

స్వకరపద్మంబులం బూజసల్పు రాజ
దంపతు లితోధికైశ్వర్యధాములగుచుఁ
దనర దీవించువారైరి జనులు నేఁటి
విజయదశమీమహమ్ముల వేంకనార్య!

17. సర్వసామర్ధ్యములు గల్గి సకల వ్యవహారములు స్వయముగా నిర్వహించు శ్రీ రాజావారికి దివాంజీయుండవలెనా?

అన్నిటఁదాసమర్ధుఁడయి యందఱనన్ని విధాలఁ జూచుసం
పన్నతగల్గి గర్వమణుమాత్రమునొందక రాజధర్మముల్
సన్నగిలంగనీయక ప్రజాహితమొప్ప ధరిత్రినేలు నా
గన్న నృపాలవర్యునకొకం డనభిజ్ఞుఁడమాత్యుఁడేటికిన్