పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
66

నట్టి విద్యాభిమాని పేరయ్య తండ్రి
ప్రబల ధీస్ఫూర్తి తిరుపతిరాయమూర్తి
విశదల పురాధికారి సేవితపురారి
నెమ్మి గుంటూరి కేతెంచి మమ్ముఁగాంచి

పాలడుగు వేంకటప్పయ
తో లలిత యశోవిలాసుతో సచివునితో
నాలోచించి మిముం దగు
వీలున సభఁగూర్చి గౌరవించెద ననుచున్

ఏకా రామాదుల నా
లోకించి సభన్‌ఘటింప లోపింపక య
స్తోక వినయోక్తిఁ బిలిచి గు
ణాకరులగువారి యిష్టమంది చని పయిన్

తన గుమాస్తాను గుంటూరి కనిపి కవులఁ
బండితుల నధికారుల భారతీ ప్రి
యత వలయు నెల్లజనుల నాహ్వాన మాచ
రింపుమన నాఘనుండట్టిరీతి జరుప

స్థిరవారమున మేము చేరితి మంతలో
         నూరూరి చుట్టముల్ చేరినారు
రెండుమూఁడామడలుండు విద్యా ప్రియుల్
         నూఱులకొలఁదిగాఁ జేరినారు
కవితా చమత్క్రియా గౌరవుల్ పాండితీ
         ధౌరేయులెందఱో చేరినారు
గుంటూరుపురినుండి గొప్పయుద్యోగులు
         శిష్ఠు లనేకులు చేరినారు