పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా కవితానుభవములు

కవుల అనుభవాలను వినడానికి లోకం ఉవ్విళ్ళూరు తుంటుంది. కవికి కావ్యానికి అవినాభావ సంబంధం ఉంటుంది. కవి మనస్తత్వం, భావప్రంపంచం తన కావ్యాలలో ప్రతి ఫలించడం సహజం, కవి జీవితం కావ్యాలకు, కావ్యాలు కవి జీవితానికి వ్యాఖ్యాప్రాయంగా కనిపిస్తాయి. అందువల్లనే కవిజీవితానుభవాలను తెలుసుకొని రెంటిని సమన్వయ పరచుకొని ఆనందం అనుభవించడానికి రసికలోకం ఆశపడు తుంటుంది, ప్రోగ్రాం డైరెక్టరుగారు కాకతాళీయంగా నా కిటువంటి అవకాశం కలిగించడం సంతోషకరం.

నాకు ఒక కుగ్రామం నివాసం. ఇప్పటివరకు నా జీవిత మంతా ఆ గ్రామములోనే కొనసాగిపోయింది. ఆ పరిసరాల ప్రభావంవల్లనో యేమో నా జీవితంలోను కవిత్వంలోను గ్రామీణత్వం పగిస్ఫుటంగా అంకితమై ఉంటుంది. ఒక యువ కవికి కవితాకన్యకు జరిగిన సంభాషణములో ఒకప్పుడు నే నీ విధంగా వ్రాసినాను:

"గ్రామవాసిని, ఎఱుఁగను గైతవంబు,
 ప్రకృతి తల్లి స్తన్యంబునఁ బ్రబలినాడఁ;
 బొలముల విహరించుచుఁ బ్రొద్దుఁబుచ్చుచుందు
 నట్టి నా ముద్దువలపును నరయలేవె?”

తనకు దై నందిన చర్యగా ఉన్న కవితాపూజను గురించి ఉత్కంఠనుగురించి ఈవిధంగా అన్నాడు: