పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకార తత్త్వము

కావ్య లక్షణములను విధించు గ్రంధములకు అలంకార గ్రంథములని యేల పేరువచ్చినది ? ముఖ్యములైన రసధ్వనులుండగా అలంకారములకేల యింత ప్రాముఖ్య మీయబడినది? “తదదోషౌ శబ్దార్థౌ సుగుణా వనలంకృతి పునః క్వాపి” అను నిర్వచనము ప్రకారము అనలంకృతము లైన శబ్దార్థములకును కావ్యత్వము సిద్ధించునుగదా,

లక్షణ గ్రంథములు అలంకార గ్రంధములని పేరు పడునప్పటికి అలంకారమను పదము కటకాంగదముల వంటిదను సంకుచితార్ధమున రూఢికా లేదు. ఈయర్థము వామనుని కాలమున ప్రారంభమయి మమ్మటుని కాలమునకు బాగుగ రూఢమైనది. అయినను తరువాతి వారుకూడ అలవాటువలన లక్షణ గ్రంథములను అలంకార గ్రంథములని వ్యవహరించు చుండిరి. కావ్య శోభాకరములైన హేతుగుణములన్నింటికిని అలంకారనామము సార్ధకమగును.

భామహుని కాలమున, మాధుర్యము, ప్రసాదము, ఓజస్సు అను కావ్యశోభా హేతువులకు గుణములను పేరు రాలేదు. కావ్యమునకు శరీరసామ్యము తెచ్చిపెట్టిన యనంతరము సాదృశ్య పరిపూర్ణతకొఱకు, శరీరము, ఆత్మ, గుణములు, అలంకారములు మున్నగునవి పృథఃకరింప బడినవి.