పుట:Kashi-Majili-Kathalu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

కాదంబరి

     నస్తి రాసులఁ జేరి యరపులతో మీఱి
                   కుర్కురంబులు దాడి గ్రుద్దులాడ

గీ. బురదగుంటలఁ బందులు పొర్లులాడ
    విస్రగంధి రజోధూమ వితతమగుచుఁ
    దులపఁజూడ నసహ్యమై తనరునట్టి
    పక్కణము గానఁబడియె నప్పతగపతికి.

నరకవాసులకుఁగూడ నుద్వేగము గలుగఁజేసెడు నామాలపల్లెం జూచి జుగుప్స జెందుచు నాహా! ఆచండాలకన్యక దూరమునందే నన్నుఁజూచి కరుణ జనింప వదలి వేయుమనునా? వట్టిది. వట్టిది. జాతికిం దగని యట్టిపని యెన్నడుం జేయదు. కానిమ్ము. నాపురాకృత మిట్లున్నది. ఏమిజేయుదును? నిమిషమైన నిందుండఁజాలనని తలంచు చుండగనే వాఁడు నన్నామెకడకుఁ దీసికొనిపోయి తల్లీ! అవధారు. ఇదిగో నీవుచెప్పిన చిలుకం దీసికొని వచ్చితిని. చూడుమని నమస్కరించి నన్నుఁ జూపెను.

ఆమగువ మిగుల సంతోషించుచు మంచిపని గావించితివని వాని మెచ్చుకొని నన్ను వానికరమునుండి తన రెండుచేతులతోఁ గైకొని పుత్రకా! నేఁటికిఁ దొరకితివిఁ కెక్కడికిఁ బోఁగలవు? నీకామ చారదోష మంతయుఁ బోగొట్టెదఁ జూడుమని పలికినది. అప్పు డొక చండాల బాలకుఁడు పరుగెత్తుకొనిపోయి లోమశంబై దుర్గంధ యుక్తంబగు గోచర్మముచేఁ గప్పఁబడిన దారుపంజర మొకదానిం దీసికొనివచ్చి యామెముందర నుంచెను. మహాశ్వేతా లోకన మనోరధములతోఁగూడ నన్ను లాగి యిందుండుము కదలకుమని పలుకుచు నన్నా పంజరములోవైచి తలుపు బిగించినది. అప్పుడు నేనాత్మ గతంబున నిట్లు తలంచితిని.