పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యక్షునికథ.

295

164 వ మజిలీ.

యక్షునికథ.

దత్తునివలనఁ దనయక్కయగు రత్నపదికయున్నయిక్క యెఱింగినదిమొదలు సువర్ణపదిక యామెం జూచువేడుక పెచ్చు పెరుగఁ భర్తతో మనోహరా ! మన మిప్పు డాయక్షశైలమునకుం బోవలయును మీమిత్రుఁ డాకథ యెఱింగించి మఱలఁ గనంబడలేదేమి? మనతో వచ్చి యాపర్వతమును జూపించునేమోయని యడిగిన సువర్ణనాభుండు ప్రాణేశ్వరీ ! అతం డామాటచెప్పినతరువాత నిదిగోవత్తునని యెందోపోయెను. తిరుగాఁ గనంబడలేదు. వానినిమిత్తము పట్టణమంతయు వెదకితిని. తక్కినమిత్రులం జేరలేదు. గోణికాపుత్రుఁడు రాజపుత్రునకు మిత్రుఁడైయున్న వాడని యాతఁడే చెప్పెను. వానింజూడ నేఁడు పోయితినికాని యంతఃపురములోనుండుటచే నావార్త. వానికిఁ దెలియఁజేయువారే లేకపోయిరి. మఱల రేపు పోయిచూచెద. నామిత్రులందఱు వచ్చువఱకు నిందుండవలయును. తరువాత మీయక్కం జూడఁబోవుదము. గుఱుతులు వ్రాసికొంటినని చెప్పిన విని యమ్మగువ దిగులుదోఁప నిట్లనియె.

బుధప్రవరా ! మేమిద్దఱ మేకగర్భజాతలము. చిరకాలము క్రిందట విడిపోతిమి. దైవికముగ దానిసేమము దెలిసినది. కాలవ్యవధి సహింపఁగలనా ? మీరే చెప్పుఁడు. నన్నక్కడఁ జేర్చి మీరు వెంటనే రావచ్చును. మీమిత్రులందఱును గలిసినవెనుక నందుఁ దీసికొనిరండు. బయలుదేరుఁడు. అని దైన్యముదోఁపఁ బ్రార్థించినది. అతం డంగీకరించెను.

వారిద్దఱు శుభముహూర్తమున నుత్తమతురగారూఢులై దత్తుఁ డెఱింగించినమార్గము ననుసరించిపోవుచు గుఱుతులుజూచుచు నుత్తరముగాఁ బోయిపోయి యేఱుల విమర్శించి మెట్టల దాటి వృక్షలతాదులఁ బరిశీలించుచుఁ దిరిగితిరిగి పదిదినముల కాశైలము గనుంగొనిరి.