పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కందర్పుని కథ

75

అలంతిసిరిం బెద్దగా దలంచుకొనుచు గర్వించువానిజన్మ మొకజన్మమే? దేశాటనము పండితమిత్రతయుం గలుగుట యుత్తమపురుషలక్షణములు దీనివలన బెక్కులాభము గలిగియున్నవి. కన్నులు గలిగినందుల కెల్లదేశములు నొక్కసారి తిరిగివచ్చుటయే సాద్గుణ్యము. ఇందులకే గదా మనపెద్దలు తీర్థయాత్రలు కల్పించిరి. ఇంతకుమున్ను నే నిన్నిదేశము లున్నవని యెఱుంగను. ఈదేశమునకంతయు నేన ప్రభుడ నగుదునని తలంచుకొనుచుంటిని. నాదేశమెంత నేనెంత నాప్రభుత్వము తలంచుకొన సిగ్గగుచున్నది. ఇప్పుడు మీరు చిత్రపటంబునం జూపిన దేశములన్నియుం జూడవలయునని నాకెంతేని యౌత్సుక్యమంకురించుచున్నది. దీనికెద్దియేని దగిన యుపాయము సెప్పి నాయుద్యమము కొనసాగింపుడు. ఈదేశము లన్నిటికిని మార్గములుండకమానవు. యెట్లు పోవలయును? యెన్ని దినములుపట్టును? ఆచారము లెట్టివని అడిగిన ఆయ్యుపదేష్ట యిట్లనియె.

వత్సా! దేశాటనము మాటలతో లేదు. యెట్టివారికిని బరదేశవాసము సంకటప్రదము అదియునుంగాక నీయభిలాష అసాధ్యముగా గనంబడుచున్నది. గరుత్మంతుండు నాంజనేయులు మొదలైన వారికిసైత మీ దేశములన్నియుఁ జూడ వశము కాదు. కొన్నిటికి గుఱ్ఱములమీదను గొన్నిటికి నోడలమీదను బోవచ్చును. కొన్ని దేశముల కెట్లుపోవుటకును దారులులేవు. గగనమార్గంబునం బోవలయునది. మనుష్యుల కెట్లుశక్యమగునో చెప్పుము. భరతఖండమంతయు దిరిగిరావచ్చును కాని యితర ద్వీపములకు బోవశక్యముకాదు ఉత్తరమున హిమవత్పర్వతము లడ్డముగా నున్నయవి. దానంజేసి అవ్వలిభూమిం జూచుటకు వశముకాదు. అదియునుంగాక భరతఖండమంతయునుం జూచుటకే పురుషుని యాయుష్కాలము చాలదు. మిగిలిన వాని మాట చెప్పనేల. సేతుహిమాచల మధ్యంబునం గల కొన్ని దేశములు మాత్రము జూచి నీయభీష్టమును దృప్తిపరచుకొనుము. అంతియకాని వెఱ్ఱియూహలం జేయకుము. నీతండ్రి వృద్ధుండై యున్నవాడు రాజ్యభారంబు వహించి న్యాయంబున బ్రజలం బాలింపుము. దాన నన్ని విశేషములు దెల్లములగునని పలికిస నారాజ పుత్రుండు వెండియు నిట్లనియె.

ప్రజలం బాలింపుమని పలుమారు నాకు జెప్పకుడు. నాపాటి ప్రజాపాలనత్వ మందఱికినిగలదు. మీయింటిలో బ్రజలులేరా? మీప్రజల మీరును బాలించుకొందురు. అంతకన్న నాయందేమియు విశేషము కనబడలేదు. ఆమాటలటుండనిండు దేశాటనము మాట విచారింపుడు. యాత్రలకు బోవువారు జూచు దేశములు మాత్రము జూచినం దృప్తి తీరదు చూచిన ద్వీపాంతర విశేషములే చూడవలయును. అందుగల క్రొత్త నడత లచ్చెరువు గొల్పకమానవు! దీనికిని సాధనములుండకపోవు. ప్రవరాఖ్యుని చరిత్ర జ్ఞాపకమున్నదా! ఓషధుల వలనగాని యంత్రములవలన గాని అట్టిపని సాధ్యమై యుండును. అట్టి విశేషములు దెలిసినవారచ్చటచ్చట నుందురు. వారి నరసి యట్టి సాధనము లెవ్వియేని సంపాదింపవలయును. ఇది మొద లీప్రయత్నము