పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

294

కాశీమజిలీకథలు - మూడవభాగము

అప్పుడా గ్రామాధికారులు కోపముతో తస్కరులు సామమున నిజము చెప్పుదురా? దండనమే వారియెడల బ్రయోగింపదగినది. వీరితోగూడ నీచేడియం గట్టి పెట్టిన నిజము దేలునని పరుషవచనంబు లాడుచున్న సమయంబున మందపాలుని యొద్ద కనిపిన దూతలువచ్చి అయ్యయ్యో? ప్రమాదము సేసితిరి వీండ్రు దొంగలు కారట. అవధూతలట? వీరి నెవ్వరును బాధింపగూడదని రాజుగారు శాసనము వ్రాసి యిచ్చినారు. చూడుడవి పలికిన విని యా యధికారులట్టి పత్రికం జదువుకొని వెరచుచు నప్పుడే బంధవిముక్తులంజేసి భోజనములం బెట్టించి సత్కారపూర్వకముగా వారి నాయూరినుండి వేఱొక గ్రామంబున కనిపిరి.

వారు నలువురు నొకరివెనుక నొకరు నడుచుచు నొకనా డొకదారిం బోవుచుండ దారిలో భూపాలదేవమహారాజుగారి మంత్రిని కొంతదూర మనిపి వచ్చుచుండెడి భట్టియు విక్రమార్కుడును దారిలో దారసిల్లిరి. విక్రమార్కుడు వారి యాకారవిచేష్టితములం గాంచి విస్మయముజెందుచు మీరెవ్వరు యెందుబోవుచున్నారని యడిగిన వారు మువ్వురు తమతమ వాడుకమాటలం బలికిరి. మాలతి యేమియు మాటాడినదికాదు. అప్పుడు విక్రమార్కుడు భట్టితో మిత్రమా! వీరిమాటలు చిత్రముగా నున్న యవి వీరివేషములు వైరాగ్యోదయములు బోధించుచున్నవి. ఆకారచిహ్నములు మహానుభావత సూచించెడివి. వీరి నెఱుంగనివార లున్మత్తులని తలంచెదరు. ఈమాటలకు తగిన కారణమెద్దియో యున్నది. దానిం తెలిసికొనుదాక మనమింటికిం బోవలదని పలికిన భట్టియు సమ్మతించెను.

అదిమొదలు భట్టియు విక్రమార్కుండునుగూడ వారుపోయిన చోటికిఁ బోవుచు నిలిచినచోట నిలుచుచు వారితో కొన్నిదినంబులు దేశాటనమునం జేసిరి. వారు నివసించిన స్థలములో సయితము దూరముగానుండుట వాడుక కావున నొక్కచోట నబ్బోటినిజూచి విక్రమార్కుండు సాధ్వీ! నేను విక్రమార్కుడ. వింతలజూచు వేడుకచే తరుచు దేశాటనముం జేయుచుందును. నీవెవ్వతెవు వీరెవ్వరు మీ వైరాగ్య వేషములకుం గారణ మేమి? నిక్కువము నెప్పుము కొఱంతగల పనులు నెఱవేర్పఁ గంకణము గట్టుకొంటినని యత్యంతప్రీతిపూర్వకముగానడిగిన నప్పడతి యెట్టకేలకు సన్ననియెలుగు రాల్పడ నయ్యొడయని కిట్లనియె.

ఆర్యా! నేనెవ్వరితో మాటాడనని నేమము జేసికొన్నను నీపేరు వినుటచే చెప్పుచున్నాను వినుము. నేను మందపాల మహారాజు కూతురును. నాపేరు మాలతి యండ్రు దైవచోదితమయిన బుద్ధిచే నొకనాడు రాత్రి నన్ను మాతండ్రి వీరిలో నొకనికి వివాహము గావించెను నాపాణి గ్రహించినవా డెవ్వడో తెలియదు. ఆ నిక్కువము దెలిసికొనుటకై నే నిట్టివేషము వైచికొని వీరివెంట దిరుగుచున్నదానను. వీరెవ్వరో నాకు తెలియదు. నీవు నృపతి సామాన్యుడవుకావు నీ చరిత్రములు నేను వినుచుంటిని వీరిలో నాపతి యెవ్వడో నిరూపించి నన్నుద్దరింపుము. నేను నీ