పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

కాశీమజిలీకథలు - మూడవభాగము

తామ్రకేశుడు - ఆయుత్తరము చూచుకొని విక్రమాదిత్యు డెక్కుడుగా నా మంత్రికి విందులు సేయదలచి మిక్కిలి వ్యవధియుండగానే యాసన్నాహమంతయు చేయుటకు భేతాళుని దలంచుకొనియెను.

భూతరాజు - అదియుం నుచితముగానే యున్నది పిమ్మట?

తామ్రకేశుడు - అతండు వెళ్ళినప్పుడు మీరాక దలంచుకొని మిక్కిలి దుఃఖించుచు జేయునది యేమియును లేక కొంతసేపు ధ్యానించి మీరు కొన్ని దినము లరిగిన వెనుక నుజ్జయినికి రండని మాకును జెప్పి తానరిగెను.

భూతరాజు - పరాయత్తుం డేమిసేయగలడు. వాని లోపమేమియును లేదు. తరువాత-

తామ్ర - మేమతని యానతిరీతి నా ప్రోలికిఁ బోయితిమి. అప్పుడతం డందు విజయవర్దనునకు సత్కారము లపూర్వములుగా గావింపుచున్నాడు ఒక్కొక్కనాడు చేయు మహోత్సవములు రెండవనాడు జేయకుండ నారునెలలు జరుపవలయునట. అప్పుడతనికి మాతో మాటాడుటకే యవకాశము దొరికినదికాదు. స్వామికార్యము నందలి భక్తిచే నెట్టకేలకు దెరపిచేసికొని మాకు కొన్ని రహస్యము లుపదేశించి యంపెను.

భూత -- వానిని మాకుఁ జెప్పవచ్చునా?

తామ్ర - దేవరకుఁ జెప్పని రసాస్యము లున్నవియా? వినుడు.

ఇచ్చట కనతిదూరములో సానుమంతమను నగరమున్నది. ఆ ప్రోలు మందపాలుండను భూపాలుండు పాలించుచున్న వాడు. అతనికి మాలతి యనుకూతురు గలదు. సురగరుడోరగగంధర్వకిన్నరకులంబులలో నంతసోయగము గల కలకంఠి పుట్టియుండలేదు. మందపాలు డక్కన్యారత్నము నిప్పు డింద్రదత్తుడను నృపపుత్రున కిచ్చి వివాహముసేయ నిశ్చయించి యున్నవాడు. ఆ వివాహదివసంబును దేవర వచ్చు దివసంబు నొక్కటియే యగుటచే నావధూరత్నమును గౌరీపూజకు కూర్చుండబెట్టిన సమయంబున శాంబరి మో'హితఁ జేసి తీసికొనిబోయి దేవర కర్పింపుడని కొన్ని మంత్రము లుపదేశించి యంపెను. ఇదియే యతండు మాకుఁ జెప్పిన రహస్యము.

భూత - మంచి యుపదేశము గావించెను. భేతాళునివంటి విశ్వాసముగల బంటు మఱియొకడులేడు తరువాత మీరేమి చేసితిరి.

తామ్ర - మేమిరువురము నేటియుదయమున నారాజుగారి యంతఃపురములో ప్రవేశించి యందలి రహస్యములన్నియు గ్రహించి ముహూర్తకాలము ప్రతీక్షించి యుంటిమి. ఇంతలో నారాజపుత్రికను జక్కగా నలంకరించి గౌరీపూజ చేయింప గనకలతికలచే నల్లబడిన గంపలో కూర్చుండబెట్టి పరిచారిక లిటునటు దిరుగుచున్న సమయములో నే నాచిన్నదానిపయి మత్తుమందు జల్లి గంపతోగూడ నాపల్లవపాణి