పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవశర్మ అను బ్రాహ్మణుని కథ

269

గాంచి అయ్యా! మేము బ్రాహ్మణులము. అన్నముకొరకీ దాపుననున్న యింటికిం బోయితిమి. ఆ యింటి యిల్లాలు మంచి పుణ్యాత్మురాలు. మాతో లేదనియు నున్నదనియుం జెప్పక తలుపువైచుకొని దాగియున్నది. మేము విటులముకాము మమ్ము జూచి సిగ్గుపడనేలకొ తెలియదని యామె నాక్షేపించుచు మా కీపూటకు భోజనము పెట్టింపగలరా? యని యడిగిరి.

ఆ మాటలువిని దేవశర్మ సిగ్గుపడుచు అయ్యా! మీరమ్మగువను నిందింపకుడు. అది నాభార్య మహాపతివ్రత, నేను లేనిసమయములో నొరులతో మాటాడదు ఇతరులం జూడదు. ఆకథ మీరెరుగక తఱుముకొనిపోతిరి. మీరు విస్సంశయముగా భోజనమునకు రావచ్చును. నిందు స్నానముచేయుడు. కలసి పోవుదము వేళయైనదని పలికినవిని యా బ్రాహ్మణులు అయ్యా! యెరుంగకన్న మాటలు క్షమింపవలయునని యపరాధము చెప్పికొని యందే స్నానసంధ్యావందనాద్యనుష్టానములు తీర్చుకొని యా బ్రాహ్మణునితోఁగూడ వారింటికేగిరి.

మిత్రవిందయు వాడుకప్రకారము పతి కెదురువచ్చి పాదములు గడిగి శిరంబునం జల్లుకొని యడగులొత్తినది. మఱియు భర్తపంక్తిని వారికిఁగూడ మృష్టాన్నములు వడ్డించినది. అతిథులు దేవతార్చననిసి సాలగ్రామతీర్ధము పుచ్చుకొమ్మని యామెకు సంజ్ఞచేయగా నా యువతి నాథా! వీరు నా వ్రతం బెఱుంగక నన్నూరక పల్కరించుచున్నారు. నేను ప్రాణనాథుని పాదతీర్థముతప్ప నితర తీర్థములం బుచ్చుకొనను. ఇతరులం జూడను ఇతరులతో మాటాడదని తెలియజేయుండని పలుకగా వారు వెరగుపడుచు నప్పు డేమియుం బలుకలేక యాపోశనము పట్టి భోజనము సేయందుడంగిరి.

ఆమె వడ్డించునపుడు వారింజూడక పెడమొగముతో వడ్డించెను అది యంతయుఁ జూచి వారిలో సోమభట్టను నాతండు అయ్యా! మేమనేక దేశములు తిరిగితిమి అనేక శాస్త్రములు చదివితిమి. పెక్కండ్రు పతివ్రతలం జూచితిమి. అట్టివారి చరిత్రంబులు వింటిమిగాని యెందునను నీమెవంటి సతీమణిని చూచి యుండలేదు. ఇట్టికథయు వినియుండలేదు. బ్రాహ్మణారాధనము, దేవతారాధనము గూడ బతివ్రతకు నింద్యమని చెప్పుచున్నది.

మేలు మేలు! పుడమిలో నీమె యొక్కరితయే కాబోలు పతివ్రత, ద్రౌపతి, సీత, రుక్మిణి, అనసూయలోనగు వారు బ్రాహ్మణులం బూజింపలేదా దేవపాదతీర్థంబుల స్వీకరింపలేదా? ఇది యపూర్వవ్రతమని యాక్షేపించిన విని దేవశర్మ యిట్లనియె.

అయ్యా! మీకు నమస్కారము. మా తప్పులన్నియు క్షమించి భుజింపుడు. మీరనినమాట యథార్థమే నేనేమి చేయుదును? ఎంతచెప్పినను వినినదికాదు. అరుంధతివోలె ప్రవర్తింపవలయునని యున్నదట పోనిండు. ఎవరివ్రతము వారిది