పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

కాశీమజిలీకథలు - మూడవభాగము

పించుచు నప్పుడే యాసోమదేవుని రావించి యతడుకోరిన దేశమంతయు ధారవోసెను.

పిమ్మట విజయుండును చంద్రుండును తాముపడిన యిడుమలన్నియు నా తరుణి కెఱింగించిరి. చంద్రుడా రాత్రి నొకగదిలో నా వీణంబాడి చారుమతిని రప్పించుకొని తనకథయంతయుం జెప్పిన నప్పడంతియు జింతించి యది మొదలా వీణమీదగాక యాకృతిని నోటితో బాడినను వచ్చుదాననని సమయముచేసినది. అతం డయ్యండజయానను రెండుదినములందుండ వేడికొని హేమ కామగువంజూపుచు బాంధవ్యమును గలిపెను. తదీయరూపలావణ్యాదివిశేషంబులు చూచి దేవయోనివిశేషుల సౌందర్య మత్యద్భుత మచింత్యమని చింతించి హేమ యా రామామణిఁ బెద్దగా మన్నించెను.

చారుమతి రెండుదినంబు లందుండి గజదత్తుని మిక్కిలి గారవించుచు దివ్యభూషాంబరంబు లిచ్చి యక్షలోకమున కరిగినది. పిమ్మట నా రాజపుత్రులిరువురు కుమారక్రీడాలాపవిలోకనకౌతురంబు దీపింపఁ గొన్నిదినంబు లందుండి తల్లిదండ్రులం జూడ వేడుకగలిగినంత నొకనాడు చతురంగబలముతో బయలుదేరి హేమయు గజదత్తుడును తోడరా గతిప్రయాణంబుల సింధుభాయినగరంబునకుఁ జని యూరికనతి దూరములోనున్న యొకతోటలో సేనలతో విడిసిరి.

తమవార్త గ్రామములో నెట్లు వెలయుచున్నదో తెలిసికొనవలయునను తలంపుతో నారాజపుత్రు లిరువురు ప్రచ్ఛన్నముగా నారాత్రి నావీటిలోనికిబోయి యొక యంగడియొద్ద గూర్చుండి కొన్నివస్తువులంగొని యాసెట్టితో వర్తకుడా! యీదేశపు రాజుపేరేమి? సంతతిగలదా? సంపన్నుడయి యున్నవాడా? యని యడిగిన నాకోమటి యిట్లనియె.

అయ్యా! మారాజునకుగల సంపద కుబేరునకులేదు కాని దైవికములగు చిక్కులు కొన్ని తటస్థించినవి. అతండు సంతానాపేక్షంజేసి నలువురు భార్యలను బెండ్లి యాడెను. పూర్వపుణ్యంబున నలుగురికి నలువురుపుత్రులు జనించిరి. వారి వివాహనిమిత్తము భార్యలు కలహించుటచే చాలినంత ద్రవ్యమిచ్చి యారాజు మీ యిష్టమువచ్చిన కన్యకలం బెండ్లియాడి రమ్మని పుత్రులను దేశములమీద కనిపెను.

వారువోయి పదునాలుగుసంవత్సరము లయినది. కొన్ని నెలల క్రిందట రెండవవాడును మూడవవాడు మాత్రము వచ్చిరి. పెద్దవాడును కడపటివాడును దారిలో తారసిల్లి తమసొమ్ము హరించి తమ్ము వంచించి తుదకొకనూతిలో బలవన్మరణము నొందినట్లు వీరిరువురు తండ్రితోఁజెప్పి యట్లు తాను తీసికొనివచ్చిన యొకచిన్నదానిచే సాక్ష్యమిప్పించిరి. ఆమాటలు వినినవా రెవ్వరును నమ్మలేదు. వారు వీరికంటె గుణవంతులును రూపవంతులు నగుటచే నట్టిపని చేయుదురా యని యందఱకు సందియముగానున్న యది. వారికిఁ జదువుచెప్పిన యుపాధ్యాయు లామాట లెంతమాత్రము నమ్మగూడదనియు వారు మిగుల గుణవంతులనియు చెప్పుచున్నారు.