పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

కాశీమజిలీకథలు - మూడవభాగము

అదియు నన్నొక పుష్పవాటికిలో నొప్పుచున్న సరసి దఱికిం దీసికొనిపోయి యనఘా! యిందు గ్రుంకితిరేని యలకాపురి కరుగవచ్చును. శుచులయ్యెదరని పలికిన నేను సంతసించుచు మెల్లన తటాకములో దిగి మొలబంటి జలములో నిల్చి చేతులచే నీరు చిమ్ముచు ముమ్మారు మునింగి లేచినంతలో ౼

మ. కులుకుం గుబ్బలు వాలుగన్నులును దళ్కుంజెక్కులింపౌపిరుం
     దులు మేలౌనడ లొప్పలౌతొడలు బల్‌తోరంపు కీల్గంటిఁజి
     ల్కల పల్కుల్ నునుతళ్కు చూపులసదౌకానందమౌ పిక్కలున్
     వలపుం బ్రాయము గల్గుకల్కి నయితి న్వ్యామోహమేపారంగన్ .

అట్టిరూపముతో నొప్పుచున్న నన్ను జూచి యాయన్నువ చిన్నదానా! యింకను స్నానముకాలేదా యిటురమ్ము. పోవుటకు మా సఖురాలు తొందరపడుచున్నదని పలికిన విని నేనాడుదాననగుట యెరుంగక యెవ్వరినో పల్కరించుచున్న దనుకొని నలుమూలలు చూచితిని. అప్పుడప్పడతి వెండియు నట్లు పలికిన గలికీ! యెవ్వతెను వేగముగా రమ్మని చీరుచున్న దానవని పలికితిని. అప్పు డది పడఁతీ! నిన్నే పిలుచుచుంటిని వడిగారమ్మనుడు వెరగుపడి నన్ను బడఁతీ! యనియెదవేల యని పలుకుచు నన్ను జూచికొంటి గబ్బిగుబ్బలు నాకన్నుల బడినవి. మదీయస్త్రీత్వము చూచుకొని శోకావేశములో అయ్యో! నన్ని యక్షకాంతలు మోసముచేసిరి యక్షిణి యన మాయయని యిందుమూలముననే కాబోలు పేరు వచ్చినది. యిప్పుడేమిచేయుదును. వీరిమాటలు యథార్థమనుకొంటిని తృణచ్చన్నకూపములని యెరుగనైతినని పెక్కుగతుల జింతింపుచున్న సమయంబున నాన్నాయతిన నాతి! వేగము రావేమి విచారింపుచుంటి వేమి! యని పలికిన నేను అయ్యో! నేనిట్లాడుదాననై తినేమి? దీని వలన మీకు లాభమేమియున్నది అలకాపురికి బోవలయునని చెప్పి యిట్లుచేయుట యుచితమా? యడిగిన యది యిట్లనియె.

వనితా! నీవేమిటికి బరితాపముఁ జెందెదవు? ఇందు మునింగినవా రంగన లగుదురు. నిన్నీ రూపముతో నలకాపురికిం దీసికొనిపోవలయునని తలంచి యిట్లు చేయించినది. వెండియు నిన్ను బురుషుం గావింపగలదు. పోదము రమ్మని పలికిన సంతసించుచు దానివెంట నమ్మంటపము నొద్దకుంబోయితిని.

నన్నుజూచి యెల్లరు నవ్వుచు బరిహాసవాక్యములచే నాకు సిగ్గు గలుగజేసిరి. అప్పుడు నేను వారివాక్యములకేమియు నుత్తరమీయక తలవంచుకొని నిలువంబడి నంతఁ జారుమతి కొమ్మా! మాయింటికిఁ బోదము రమ్మని పలికి నాచేయిపట్టుకొని లాగికొనిపోయినది. ఆవాల్గంటుల వెంట నాగుహావిశేషములు చూచుచు నేనలకాపురి కరిగితిని. ఎఱిగినవారికిగాఁక పరబ్రహ్మ కాగుహలో నఱుగుట శక్యముగాదు. నన్నుఁ జెలికత్తెలతోఁ జేర్చి యక్కాంత యేకాంతనిశాంతమునకుఁ దీసికొనిపోయినది కావున నన్నెవరు గుఱుతుపట్టలేదు. ఆహా! అలకాపట్టణము సౌరీతీరుననున్న