పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

కాశీమజిలీకథలు - మూడవభాగము

చితి యుత్తమలక్షణములుగల రాజకన్యకలవార్తల దెలియక నటనుండి పశ్చిమదేశంబునకుం బోయితిని. ఆచ్చటను నామదికెక్కిన రాజపుత్రికల చారిత్రంబులు వినబడ లేదు. ఒకనాడు కొందరు సిద్దులు మహాశివరాత్రికి శ్రీశైలమునకుం బోవుచుండ నేనును వారిం గలిసికొని శ్రీశైలమునకుఁ బోయితిని. మహాశివరాత్రి దినంబున పాతాళగంగలో స్నానము చేసి మల్లిఖార్జున మహాదేవుని లింగంబు పాతాళ గంగాంబువులచే నభిషేకము గావించి బిల్వదళంబులం బూజించి భక్తివిశ్వాసములతో నందొకచోట గొందఱు భక్తు లప్పర్వతప్రభావంబు జదువుచుండ నాదండం గూర్చుండి సాంగముగా నా వృత్తాంతమంతయు నాలకించితిని.

ఆ కథలో శ్రీశైలంబునం గల గుహావిశేషంబులు మార్గంబులు చక్కగా వ్రాయబడియున్నవి. వానిలో వామనగుహావృత్తాంతంబు స్వాంతంబున గుఱుతుపెట్టుకొని యమ్మఱునాఁ డుదయంబున బాతాళ గంగానదీకూలము వెంబడి తూరుపుగా గొంతదూరము నడచి పురాణములో జెప్పినగుఱుతులఁ జూచికొని పై కెక్కి కొంత దూరము బోయి చూడ నొకబిలము గనంబడినది

దానిముఖంబున వామనమూర్తి విగ్రహముండుట జూచి యిదియేగదా వామనబిలమని నిశ్చయించి సాహసముతో నందు బ్రవేశించితిని. అది కొంతదూరం నడచిపోవునంత విశాలముగానున్నది. క్రమంబున జిన్నదగుచుండుటచే వంగి కొంత దూరము నడువవలసివచ్చినది. మఱికొంతదూరము చేతులతో నానిపోయితిని. గాఢాంధకారములో నేమియు గనఁబడకుండుటచే జేతులతో దడిమికొనుచు దైర్యము చెదరనీయక మెల్లగా మఱికొంతదూరము పోయితిని దివారాత్రిభేదము తెలియమి నెన్నిదినములు పోయితినో తెలియదు. పోయినకొలంది యాబిలము చిన్నదగుచు మెలికలుగా నుండుటచే నతిప్రయత్నముతో దాటి కొంతమేర బరుండియే ప్రాక దొడంగితిని. అట్లతిషముగా గొంతదూరము ప్రాకి పిమ్మట నిటునటు కదలుట కవకాశముగానక తొట్రుపడుచు మనంబున బెదరుదోప వచ్చిన పయనంబంతయు నిష్ఫలంబయ్యెనని చింతించుచు నక్కటా! నేనక్కడక్కడ గ్రుమ్మరి యింటికింబోక నీ శ్రీశైలంబున కేమిటికి వచ్చితిని? వచ్చితివిబో పురాణవచనంబులు విన గుహాప్రవేశాభిలాషయేల కలుగవలయును? ఇట్టి మార్గంబులుండిన నందఱు బోవుచునే యుందురు నాకీ గుహాంతరంబున మరణంబు విధియించి యున్నవాడు కాబోలును. అన్నా వెనుకకు బోవుదమన్నను శక్యముగాక యున్నది. ఊపిరి వెడలుటకైన నవకాశములేదు ఇక రెండుమూడు గడియలకన్న బ్రాణంబులు నిలువవు. భగవంతుని ధ్యానించుటకంటె వేఱొక చింత లెన్నకాదని కన్నులు మూసికొని భగవంతుని ధ్యానించుచు బ్రాణోత్క్రమణసమయ నరయుచుంటిని.

అట్లు కొంతసేపు ధ్యానించునంతలో నా చెవులకు మనోహరమైన వీణాగాన మొకటి వినవచ్చినది. అప్పుడు నేను గన్నుల దెఱచి చూచుచు అయ్యో! నేనింకను బ్రతికేయుంటిని. ఈగాన మెచ్చటినుండి వచ్చుచున్నదో? మరణావసరంబున నిట్టి