పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కల్పవల్లి కథ

215

తయుం జెప్పి యాకార్యమునకు నాతనింగూడ నౌత్సుక్యము గలవానిగా జేసెను. వివాహముహూర్తము దాపుననే పెట్టించి సామంతరాజులకెల్ల శుభలేఖలు వ్రాయించి రప్పించెను. ఆ విజయవార్తవివి కృష్ణదేవరాయలు సంతోషపారావారవీచికలం దేలుచు అష్టదిగ్గజకవీంద్రులతో హితమంత్రిపరిజనసహితుండై యచ్చటికి వచ్చెను. తమకువ్రాసిన శుభలేఖలు చూచుకొని మితిలేని యానందముతో కలిఘాతాపురినుండి కల్పవల్లియు సునందయు మకరందుడు సింధువర్మ లోనగు బంధువులందరు సపరివారంగా వచ్చి మందారవల్లిని, బ్రియంవదను జూచి గాఢాలింగనము జేసికొనుచు బెద్దతడవు తత్కథాశ్రవణాసక్తచిత్తులై గడపిరి. అంత శుభముహూర్తంబున వారికి లోకాతీతమగు విభవముతో వివాహము జరిగినది.

అందు రామలింగకవిని గొన్నిదినంబు లుంచవలయునని యవన ప్రభుడు కృష్ణదేవరాయలవారిం గోరుటయు నుత్సవదినము లన్నియుంగడపి యారాజు పరివారముతోగూడ విజయపురికిబోయెను. రామలింగకవి చమత్కారకృత్యములన్నియు జూచుచు మోహనచంద్రుడు వార మొకగడియలాగున వెళ్ళించుచుండెను. ఆవింతల నొడువుట కిప్పుడు సమయముచాలదు. రాయలవారు చంద్రగిరికి బోవునపు డొకనా డీయూరిలో నివసించి యీ పద్య మొకశిలపై జెక్కించి యిందు స్థాపించిరి. ఇదేగాక యీ పద్యము పెక్కుచోట్ల వ్రాయించెను గోపా! నీవు జూచిన పద్యవృత్తాంత మిది యని చెప్పిన వాడు అయ్యవారూ! మంచికథ చెప్పితిరి. ఇంత సంతసమెప్పుడును గలిగియుండలేదు. వేళయింక చాలయున్నది గదా! రామలింగకవి ఢిల్లీపట్టణములో బెక్కువింతచర్యలం గావించెనని చెప్పితిరి ఇంతలో గొన్నిటి జెప్పుడు. మీ యడుగు లొత్తెదనని వేడిన మణిసిద్ధుడు ఓహో? కర్మము చాలక నోటినుండి వచ్చినందులకు బట్టికొంటివి. ఎప్పుడయిన ముందు జెప్పెదగాని యిప్పుడుగాదు. కొంచెము విశ్రాంతి వహింపవలయునని చెప్పి యాదివసంబు గడపి మఱునాడు తదనంతరనివాసప్రదేశంబు చేరెను.