పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

కాశీమజిలీకథలు - మూడవభాగము

క్రమంబునా దమతమ విడెదములకుంబోయిరి. అమ్మరునాడుదయంబున రహస్యవిశేషంబుల దెలిసికొన బంపిన సుభద్రుండువచ్చి మిత్రమా! నేను బూర్వమువలె నమ్మవారి ప్రసాదంబిచ్చు నెపంబున మందారవల్లి ఆవనధంబునకుబోయి కొంచెము మాటుగా నిలువంబడినంత వారిమాట లిట్లు విననయ్యెను.

మందా - కాంతలారా! మీరింత పిరికితనంబు బూనితిరేల? నిన్నటిసభలో నొక్కమాటయు యుక్తియుక్తముగా జెప్పలేదు. కారణమేమి?

శిష్యురాండ్రు - అమ్మా ! మేమేమి చెప్పుదుము. ఆబ్రహ్మచారు లెదగిత్తలవలెనుండి మమ్ము మాటాడనిచ్చిరికారు. మేమెద్దియేని చెప్పితిమేని కాదని ఏదియో పుస్తకముంజూపురు. ఆలిపి బ్రహ్మలిపి అట. ఎవ్వరికిందెలియదు. అశ్రుతపూర్వము అదృష్టపూర్వము పోనీ తప్పందమన్నను ఆలిపి క్రొత్తగా వ్రాసినట్లు కనబడదు. అందలివిషయములు దేవతలు వాడునవి అట . భాషలులిపులు అనంతములని యున్నది గదా? ఆలిపి తెలియమి నింతవచ్చినది. విద్యలచేగాక మాటలచేతనే యోడిపోయితిమని విచారముగా నున్నది. ఏమి చేయుదుము . అదేమిపాపమో యొక్కమాటయు తోచినదికాదు. ఆ కొదవరేపు మీరు తీరుతురసు నాసతో నున్నారము .

మందా - అయ్యో! వట్టిమాటలకే సదుత్తరము లీయలేక పోతిమిగదా. ఇది అంతయు రామలింగకవి కల్పితముగాని మఱియొకటి గాదు. మనము పులియున్న పొదకు రాగూడదు. నామది నపజయసూచకములు పెక్కులు పొడముచున్నవి. అతండు లవిత్ర అని పేరు పెట్టుకొని స్త్రీ వేషముతో వచ్చిన కారణము ఱేపునొడివెద. లోకమంతయు జయించి తుదకు వీరిచేత నోడిపోవలసివచ్చినది నాకెవ్వనియందు సందియమో ఆతండే భంగపఱచెను. పెక్కు దేశములుండ నీతనిచరిత్రములు వినియు నిందురానేల. కాలగతియే విపరీతబుద్దులం బుట్టించును.

శిష్యు - అమ్మా నీవు వీరిని బరిభవింతువని నెంతయో యాశతో నుంటిమి. ఈలాగు నధైర్యపడుచుంటివేమి? రామలింగకవి పేరు యెక్కడను లేనిదే ఆతనిం దలంచుకొని వెఱచుచుంటి వేమిటికి! నీ విద్యామహిమ మఱచితివా ?

మందా - అయ్యో? మీ కేమి తెలియును. నేనాగతము గురు తెఱింగినదానఁ గాన నింతగా వక్కాణించుచుంటిని కానిండు యేమి చేయుదుము. ఉచితముకొలది యాలోచించుకొందము.

అని యట్లు వారుసంభాషించుకొనుచుండగా నేను ప్రసాదము దీసికొని దాని యెదుటికింబోయితిని మొగమునందేమియు గళలేదు. విచారముగా నున్నది. నన్ను జూచి యొక చేటికకుం గనుసన్నజేయ నదివచ్చి ప్రసాదము గైకొనినది. నేను కూర్చుండక పూర్వమే ప్రొద్దుబోయినది. నేటి కింటికి దయచేయుమని సూచించగా సంతసించు లేచివచ్చితిని ఇదియ రాత్రిజరిగిన విశేషంబు. నీకతంబున దానికి కంపము జనించినది. అని చెప్పిన విని రామలింగకవి ఆతని మిక్కిలి గారవించెను.

అంత మఱునాడు యథాకాలమునకు సభ కూడినది. అమాత్యుండులేచి మును