పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

కాశీమజిలీకథలు - మూడవభాగము

ఆతని తొట్రుపాటుచూచి సామాజికులు పకపక నవ్వజొచ్చిరి. అప్పుడాపండితులు ఓహో! వసుచరిత్రము వ్రాసినవారలు మీరేనా? రామరాజకవి అను మఱియొకపేరు మీకేకదా గలిగియున్నది. వసుచరిత్రములో-

మ. నను శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ప్రాణనం
     దన కారుణ్యకటాక్ష లబ్థకవితాధారాసుధారాశి సం
     జనితై కైక దినప్రబంధఘటికా నద్యశ్శత గ్రంథక
     ల్పను సంగీతకళారహస్యనిధి బిల్వంబంచి పల్కె న్గృపన్.

అని వ్రాసికొంటిరి. శాస్త్రములేమియు చదివినట్లు వ్రాయకపోవుటచే శ్లో॥"శాస్త్రేషుహీనాః కవయోభవంతి " అనియున్న యార్యోక్తి మీయందు రూఢమై యున్నది. దానంజేసియేకాబోలు మీ గ్రంథమందన్ని తప్పులున్నవి. మేము మీ గ్రంథముమీదనే పూర్వపక్షము చేసెదము. శిద్దాంతము చేయగలరా? మీకు బాఠము లేమి శాస్త్రముల త్రోవదొక్కనేల? సంగీతమున నిధినని ప్రయోగించుకొంటిరి. దానిలో గొంత ముచ్చటింతము. మీరు వాదులుగా నుండెదరా, ప్రతివాదు లయ్యెదరా?

అని నిర్లక్ష్యముగా బరిహాసగర్భితములైన వాక్యములచే ఆతని రోసమెక్కించినది. మఱి చెప్పనేమి యున్నది. వసుచరిత్రములో శబ్దదోషములు అర్థదోషములు పద్యవాక్యదోషములు నిరూపించు శాస్త్రములు లుదహరించుచు అయ్యించుబోణులు చక్కని వాక్యపద్ధతులచే నా భట్టుమూర్తిని క్షణములో నిరుత్తరుంజేసిరి. ఆహా! వారి వాదశక్తినైపుణ్యము వక్తృత్వము వినితీరవలయును. ఒక్క మాటకు బదిమాటలు జెప్పదొడంగిరి. వాదములో దొందరమేమియుం జూపక మెల్లగా వ్యక్తముగా యుక్తియుక్తముగా బలుకుచు తమసిద్ధాంతములన్నియు బ్రతివాదిచేతనే యొప్పించుచు అవలీల నెత్తివేసిరి. ఆసభలో వారిలో నొకమాటయేని భట్టుమూర్తి సదుత్తముగా జెప్పలేడని పిల్లవానికి సైతము వెల్లడియైనది.

అట్లు నిరుత్తరుండైన భట్టుమూర్తింజూచి బరితపించుచుఁ దమయుపాధ్యాయ వృథాశ్రమపడి యింతదూరము వచ్చినది. దూరపు కొండలు నునుపు అనుసామెత నిక్కువమగును. రాయలవారి యాస్థానమున అష్టదిగ్గజములను బిరుదులుగలపండితు లుండిరను వాడుక మాత్రము గొప్పది. పాపమీమహారాజుగారు వీరిని గజములవలెనే పోషించుచున్నవాడు. మొదటి గజ మీయనయే కాబోలును. ఇక రెండవ గజ మేమి చేయుచున్నదియో?

అని యీరీతి మర్మచ్ఛేదములగు మాటలచే మన పండితుల దూలనాడిరి? అమ్మాటలు విని మన పండితులు మారుపలుకక నేల వ్రాయుచుండుటజూచి రాయల వారు తలయూచుచు నెద్దియో ధ్యానింపుచుండ అక్కామినులు మహారాజా! మీరు నిరూపించిన పండితుం డోడిపోయెను. రెండవవానిం బంపెదరా? జయపత్రిక నిప్పింతురా? వృథాకాలహరణముసకు మా యుపాధ్యాయిని సైచదు అని యూరక తొందర