పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనాలిరామలింగకవి కథ

143

పలుకదు లోపలకుంబోయి ఆయువతియున్న అంతర్బవనము జూచితిని. ఆహా ! దానిలోనున్న అలంకార మింద్రసభలోనైన లేదనుకొనియెదను. నానాదేశ విచిత్ర వస్తుమండితంబై యాకుటీరం బెంతేని విశాలముగానున్న యది. దానింజేసిన వాడెంత నేర్పరియో? పైకిజూడ నేమియుం గనంబడదు. లోపల నెన్నియో అంతర్భవనములు రాజభవనంబులవలె శోభిల్లుచున్నవి.

పిమ్మట అమ్మందిరాభ్యంతరమున రత్నపర్యంకంబున నోరగా గూర్చుండి శిష్యురాండ్రకు శాస్త్రములు గఱుపుచున్న యాయన్నులమిన్న నా కన్నులంబడినది. కవీంద్రా! మనము గ్రంథములం జదివి భావనాపూర్వకముగా నింతుల వర్ణించుటయే గాని సర్వావయవసుందరులగు నిందుముఖుల నెందును జూచియెఱుంగము అమ్మకచెల్లా! మొదట అమ్మదవతి యొడలితళ్కు మెఱుపుతీగలవలె నాకన్నులకు మిరుమిట్లు గొల్పినది. నేను జెప్పునది అతిశయోక్తి ఆనుకొందురేమో అంతయు స్వభావోక్తియేసుఁడీ? మఱికొంతసేపు దానిమెఱుగిడిన కుందనపుబొమ్మ అనుకొంటిని. తరువాత మేనునకెద్దియో తళ్కురంగు అలందికొనినదని తలంచితి మఱియు దర్కింప సహజశరీరలావణ్యం బగుట వెఱగుబడితిని. ప్రత్యవయవముసౌరును విమర్శింపదలంచి నేను దానిం దిలకించునంతలో నాతలోదరిమెరుగుచూపులు నాపై బరగించినది.

అయ్యారే! దానిమొగమంతయుఁ గన్నులుగానేయున్నట్లు తోచినది. చారలు గీరలు కొలుచుటకుజాలవు. ఆచూపులతోడనే నేను వివశుండనైతిని. కొంతసేపు నే నెందుంటినో యేమిటికి వచ్చితినో యే వేషము వైచుకొంటినో నాకేమియు దెలియ లేదు. ఆసమయమున దాని చెలికత్తెలెద్దియో నన్నడిగిరి. నాచేటిక సమాధానముచెప్పి నాగౌరవము నిలిపినది నేను స్త్రీవేషముతో వెళ్ళితిని కావున నాబూవుఁబోణి పయ్యెద జక్కగా సవరించుకొనలేదు. దానంజేసి లావణ్యభూయిష్ఠంబులైన తదవయవము లన్నియు దెల్లముగాఁ జూడనయ్యె. మదీయవికారంబుఁ జూచి యాచిగురుబోడి గ్రహించునేమోయని వెఱపుచెందుచు నెట్టికేడెందంబు త్రిప్పుకొంటిని.

దానిసోయగముమాట అటుండనిమ్ము. మనోహర రూప యౌవనవతులగు యువతులు పెక్కండ్రు చుట్టును గూర్చుండి శాస్త్రపాఠములు చదువుచుండ నందరకు అన్నిరూపులై సమాధానము చెప్పుచున్న యది. నేను కొంతసేపు వింటిని. వాండ్రువేయు ప్రశ్నలకును అదిచెప్పు సమాధానములకు గూడ నాకేమియు నర్థమేయైనది కాదు. అది పత్రికలో వ్రాసిన సంగతియంతయు యథార్థమని నమ్మవచ్చు. అరువదినాలుగువిద్యలును పాఠములు చెప్పుచున్నది. తరువాత వినుము. నేనట్లు నిలువబడి తదేకదృష్టిగా జూచుచుండ రెండుమూడుసారులు నాపై జూడ్కుల బరగించి యా బోటి యేమిటికై వచ్చినదో యరయుమని యొకనాతికి గనుసన్న జేయగా అది నన్నడిగినది.